AP BRS Party: ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఈయనే.. అదే నిజమైతే జనసేనకు పెద్ద షాకే!

Kaburulu

Kaburulu Desk

January 2, 2023 | 09:13 AM

AP BRS Party: ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఈయనే.. అదే నిజమైతే జనసేనకు పెద్ద షాకే!

AP BRS Party: సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏపీలో ఎప్పుడు అరంగేట్రం చేయబోతుంది? ముందుగా సభ ఎక్కడ పెడతారు? సభలో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడతారు? రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని ప్రకటిస్తారు? ఇలా ఎన్నో ప్రశ్నలు ఏపీ రాజకీయ వర్గాలను వెంటాడుతున్నాయి. జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ సొంతరాష్ట్రమైన తెలంగాణలో మరోసారి విజయం సాధించడం ఎంతో ముఖ్యం.. అలాగే మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలో కూడా అంతో ఇంతో ఆదరణ సంపాదించుకోవాల్సి ఉంటుంది.

ఇప్పటికే సీఎం కేసీఆర్ ఏపీలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై కసరత్తులు కూడా చేయగా.. సంక్రాంతి తర్వాత కీలక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు రాజకీయ వర్గాలు. అన్నీ కుదిరితే పార్టీ ఏపీ అధ్యక్షుడిని కూడా అప్పుడే ప్రకటించనున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. పార్టీ అధ్యక్షుడి ఎంపిక కులసమీకరణల ఆధారంగానే జరుగబోతున్నట్లు తెలుస్తుంది. అది కూడా ఈయనే ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అని కూడా రాజకీయ వర్గాలలో జోరు ప్రచారం మొదలైంది.

తోట చంద్రశేఖర్.. ప్రస్తుతం జనసేన పార్టీలో రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా కీలక స్థానంలోనే ఉన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి అయిన చంద్రశేఖర్ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడుగా కూడా పేరు. అయితే.. చంద్రశేఖర్ జనసేనకి గుడ్ బై చెప్పేసి బీఆర్ఎస్ కారు ఎక్కేస్తారని తీవ్ర ప్రచారం జరుగుతుంది. అది కూడా ఒకటి రెండు రోజులలో జనసేన రాజీనామా ప్రకటనలు వచ్చే ఛాన్స్ ఉందని ఆ తర్వాత ఒకటి రెండు రోజులలో బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తుంది.

సహజంగా ఏ పార్టీ అయినా ఇలా అధ్యక్షుల దగ్గర నుండి మంత్రుల వరకు కుల సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటుంటాయి. బీఆర్ఎస్ కూడా అలాగే లెక్కలేసి కాపు సామజిక వర్గానికి చెందిన చంద్రశేఖర్ కు రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఏపీలో బలమైన సామజిక వర్గాలలో ఒకటైన కాపు బలాన్ని తనవైపుకి తిప్పుకొనే ప్లాన్ లో భాగంగానే చంద్రశేఖర్ ను పార్టీ అధ్యక్షుడిగా నియమించనున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఆయనతో టచ్‌లో ఉండగా ఒకటీ రెండు రోజులలో అన్నీ క్లారిటీ వచ్చేయనున్నట్లు తెలుస్తుంది. అదే నిజమైతే ఏపీలో జనసేనకి భారీ షాక్ అనే చెప్పుకోవాలి.