Annavaram Temple: అన్నవరం దేవస్థానంలో వస్త్రధారణపై నిబంధనలు.. నో జీన్స్ జీన్స్, నో స్కర్ట్స్!

Kaburulu

Kaburulu Desk

March 8, 2023 | 05:00 PM

Annavaram Temple: అన్నవరం దేవస్థానంలో వస్త్రధారణపై నిబంధనలు.. నో జీన్స్ జీన్స్, నో స్కర్ట్స్!

Annavaram Temple: హిందూ ఆలయాలకి వచ్చే భక్తులు, ముఖ్యంగా యువత ఎలా పడితే అలా వస్తున్నారు. జీన్స్ లు, టీ షర్ట్స్ ధరించి కూడా దేవుని సందర్శనకు వస్తున్నారు. వీరిలో యువతులు కూడా టీ షర్ట్స్, ప్యాంట్స్ ధరించి రావడంతో ఆలయ పవిత్రత కోల్పోతుంది. వీరందరినీ దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు దేవాలయాలలో సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆలయాల్లో ఈ నిబంధన కొనసాగుతుండగా.. తాజాగా అన్నవరంలో కూడా పక్కాగా అమలు చేయనున్నారు.

ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని ఆలయంలో నేటి నుంచి సంప్రదాయ వస్త్రధారణ నిబంధన అమల్లోకి వచ్చింది. తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థాల మాదిరిగా అన్నవరంలోనూ సంప్రదాయ వస్త్రధారణ నిబంధన అమలు చేయాలని 2019 జూలైలోనే నిర్ణయించిన విషయం విదితమే. కాగా, ఈ బుధవారం నుండి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో ముఖ్యంగా వ్రతాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఏటా ఇక్కడ ఆరు లక్షలకు పైగా వ్రతాలు జరుగుతాయి. స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణం ఉంటుంది. సుమారు ఏడు నుంచి ఎనిమిది వేల మంది దంపతులు నిత్య కల్యాణంలో పాల్గొంటారు. వీటితోపాటు సుప్రభాత సేవ, ఆయుష్య హోమం, ఈశ్వరునికి అభిషేకం, సహస్ర దీపాలకంరణ, పవళింపు సేవ, స్వామి, అమ్మవార్లకు అష్టోత్తరం, సహస్రం, మఖ నక్షత్రం రోజున అభిషేకం, స్వర్ణ పుష్పార్చన, హారతి సేవ, శివాభిషేకం, వనదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యంగిర, చండీ హోమాలు తదితర ఆర్జిత సేవలు నిర్వహిస్తారు.

ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొనే పురుషులు పంచె, కండువా, లేదా కుర్తా, పైజమా, మహిళలు చీర, జాకెట్టు లేదా చుడీదార్, చున్నీ, చిన్నపిల్లలు లంగా, జాకెట్టు, వోణీ లాంటి దుస్తులను మాత్రమే ధరించాల్సి ఉంటుంది. ఒకవేళ భక్తులు తమ వెంట సంప్రదాయ దుస్తులు తెచ్చుకోకుంటే వీటిని కొనుగోలు చేసుకునేలా దుకాణాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇకపై ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ఆలయ ఇన్ చార్జ్ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ ఆదేశాలు జారీ చేశారు.