Viral News: నా నాటుకోడి కాలు విరగ్గొట్టారు.. న్యాయం చేయండి.. పోలీసులకే ఝలక్ ఇచ్చిన మహిళ!

Kaburulu

Kaburulu Desk

February 25, 2023 | 09:11 PM

Viral News: నా నాటుకోడి కాలు విరగ్గొట్టారు.. న్యాయం చేయండి.. పోలీసులకే ఝలక్ ఇచ్చిన మహిళ!

Viral News: కొంతమంది చదువు లేకపోయినా తెలివిలో ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించుకుంటుంటారు. ఒక్కోసారి పల్లెల్లో కూలి పనికి వెళ్లే ఆడవారి బ్రెయిన్ కూడా అయస్కాంతంలా పనిచేయడం చూసి అవాక్కవుతుంటాం. ఇప్పుడు మీరు చదవబోయే స్టోరీ కూడా అలాంటిదే. తన నాటు కోడి కాలును పక్కింటి వాళ్ళు విరగ్గొట్టారని ఓ మహిళ పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. అక్కడ పోలీసులతో పాటు ఇతరత్రా వారు అడిగిన ప్రశ్నలకు ఆ మహిళ చెప్పిన సమాధానం విని అందరూ ఆశ్చర్యపోయారు.

బిహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బలువా ప్రెగ్వా గ్రామంలో గౌరీ దేవి అనే మహిళ నివాసం ఉంటోంది. ఆమెకి ఒక కోడి పుంజు కూడా ఉంది. అయితే గౌరీ దేవికి కొన్ని రోజులుగా పక్కింటి వారితో తరుచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఇలాంటి సమయంలోనే ఎవరో గౌరీదేవి కోడికి ఒక కాలు విరగ్గొట్టారు. దీంతో ఆ మహిళ పక్కింటి వారే తన కోడి కాలు విరగ్గొట్టారని పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది.

తన కోడికి న్యాయం చేయమని గౌరీదేవి పోలీసులకు మొరపెట్టుకుంది. తన కోడిపుంజు కాలును పక్కింటి వారు విరగ్గొట్టారని.. వారిపై చర్యలు తీసుకొని తనకు, తన కోడిపుంజుకు న్యాయం చేయాలని కోరింది. నా కోడిపుంజు ఇంటి నుంచి బయటకు వెళ్లటమే ఆలస్యం.. దానిని పక్కింటివారు కొడుతూ ఉండేవారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా వాళ్ళు నా కోడిపుంజుని కొట్టేవారని.. ఎవ్వరులేని సమయం చూసి వారు సమయం చూసి నా కోడి కాలు విరగ్గొట్టారని ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. ఘటనపై కేసును నమోదు చేసినట్లు తెలిపారు. పక్షుల చట్టం ప్రకారం నిందితులపై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

అయితే, ఇదే సమయంలో అక్కడ ఉన్న కొంత మంది గౌరీ దేవిని కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి ఆమె చెప్పిన సమాధానాలతో అందరు అవాక్కయ్యారు. ఎలాగూ కోడి కాలు విరిగిపోయింది కదా.. దాంతో నువ్వేం చేస్తావ్? ప్లాస్టర్ పెట్టి అతికించి పెంచుకుంటావా అని అడిగారు. దానికి ఆ మహిళ.. అబ్బే ఇంటికి తీసుకెళ్లి వండుకొని తింటానని సమాధానం చెప్పింది. వండుకు తినేస్తే మరి రేపు ఈ కేసుపై సాక్షం అడిగితే ఎలా చేస్తావ్ అని మరో ప్రశ్న అడిగారు. దానికి ఆమె.. ఇప్పుడు మీరు వీడియో రికార్డ్ చేశారుగా దాన్ని చూపిస్తానని తెలిపింది. దీంతో అక్కడ ఉన్న వారంతా ముక్కున వేలేసుకున్నారు.