TS Budget Sessions: వాడీవేడీగా బడ్జెట్ సమావేశాలు.. ఈటల, హరీష్, భట్టి మధ్య విమర్శల యుద్ధం!

TS Budget Sessions: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. తొలిరోజు గవర్నర్ ప్రసంగం.. ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టడంతో సరిపోగా.. ఆ తర్వాత అధికార, ప్రతిపక్షాల మధ్య అసలైన యుద్ధం మొదలైంది. ఒకవైపు కాంగ్రెస్ లో సీనియర్ నేతలు.. మరోవైపు బీజేపీ నేతలు, మజ్లీస్ నేతలు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుండగా.. అధికార పార్టీ నేతలు అందుకు ధీటుగా బదులిస్తున్నారు. మొత్తంగా బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి.
బుధవారం చర్చలో భాగంగా బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్.. అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేలకు రూమ్ కేటాయించకపోవడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీలో టిఫిన్ చేయడానికి కూడా తమకు రూం లేదని, రూం కూడా కేటాయించకపోవడం ఎమ్మెల్యేలను అవమానించడమే అని, తాము కార్లలో కూర్చుంటున్నామని అన్నారు. కనీసం యూరినల్స్‌కు వెళ్లేందుకు కూడా మాకు వెసులుబాటు లేదని, ఇంత అవమానమా? అని ప్రశ్నించారు.
ఈ విషయంపై స్పీకర్‌ను అరడజను సార్లు కలిశామని.. ఏ మాత్రం స్పందన లేదని చెప్పుకొచ్చారు. అలాగే బీజేపీ సభ్యులను బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) మీటింగ్‌కు కూడా పిలవడం లేదని.. ఇది అవమానం కదా అని ప్రశ్నించారు. ఈటల ఆరోపణలపై స్పందించిన మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇస్తూ.. ఐదుగురు సభ్యులు ఉంటేనే రూమ్ ఇస్తారని, ఆ విషయం సీనియర్ సభ్యులైన ఈటలకు తెలియదని కౌంటర్ ఇచ్చారు.
మళ్ళీ బడ్జెట్ అంశంపై కూడా ఈటల ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. దళితబంధు అమలకు సీఎం 2 లక్షల కోట్లు కావాలని అన్నారని, కానీ ఇప్పుడు బడ్జెట్ లో 17 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, ఈ లెక్కన పథకాన్ని ఎప్పటిలోగా అమలు చేస్తారని ఫైర్ అయ్యారు. ఇంతలోనే సీఎల్పీ నేత నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తలసరి ఆదాయం పెరిగిందని చెబుతున్న ప్రభుత్వం.. రూ.5 లక్షల కోట్ల అప్పులు ఎందుకయ్యాయో చెప్పాలని నిలదీశారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేఘా కృష్ణారెడ్డి, మై హోం రామేశ్వర్ రావు, బండి పార్థసారధి తదితరుల ఆస్తులు పెరిగాయే తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదని ఫైర్ అయ్యారు. గల్లీకో బెల్ట్ షాపు పెట్టి రాష్ట్రాన్ని మత్తులో ముంచారని భట్టి ఆరోపించారు. మొత్తానికి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి.