Canadian Women: 80 ఏళ్ల వృద్ధురాలి గిన్నిస్ రికార్డ్.. ఇప్పటి వరకూ తన జీవితంలో 96 లీటర్ల రక్తదానం!

Canadian Women: ప్రాణాపాయంలో ఉన్న వారికి రక్తదానం చేయండి.. ప్రాణాలను కాపాడండి. ప్రతి చోటా ఈ స్లోగన్ కనిపిస్తున్నా మనలో ఎంతమంది ఇది పాటిస్తున్నారు? మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నపుడు అత్యవసర ఆదుకునేది రక్తం.. ఆ సమయంలో రక్తదానం చేసిన వారు దేవుడితో సమానంగా చూస్తారు. అందుకే అంటారు రక్తదానం మహాదానం అని. ఎవరైనా సరే ప్రాణాపాయ స్థితిలో ఒకే బ్లెడ్ గ్రూప్ వారైతే రక్తదానం చేసి కాపాడితే.. వారిని జీవితంలో మర్చిపోలేరు. అలాంటిది ఓ మహిళ తన 80 ఏళ్ల వయసులో ఏకంగా 96 లీటర్ల రక్తాన్ని దానం చేసి ప్రపంచ గిన్నిస్ రికార్డ్ లో చోటు దక్కించుకుంది.
కెనడాకు చెందిన ఓ మహిళ ఆరు దశాబ్దాలుగా రక్తదానం చేస్తూ.. అరుదైన రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆమె వయసు 80 సంవత్సరాలు. 60 ఏళ్లుగా ఇప్పటి వరకూ 96 లీటర్ల రక్తదానం చేశారామె. ఆమె పేరు జోసెఫీన్ మిచాలుక్ (80). కెనడాకు చెందిన ఆమె అరుదైన గిన్నిస్ రికార్డును తన సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా జోసెఫీన్‌పై గిన్నిస్ రికార్డ్స్ వారు పొగడ్తల వర్షం కురిపించారు. రక్తదానంతో ఆమె చాలామంది ప్రాణాలను కాపాడారని పేర్కొన్నారు.
జోసెఫీన్ 1955లో 22 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన సోదరి ప్రోత్సాహంతో తొలిసారి రక్తదానం చేశారు. నాటి నుంచి క్రమం తప్పకుండా ఆమె రక్తదానం చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకూ సుమారు 203 యూనిట్ల రక్తాన్ని ఇచ్చారు. ఇది సుమారు 96 లీటర్లకు సమానం. ఎనభయ్యో పడిలో ఉన్నప్పటికీ ఆమె రక్తదానాన్ని కొనసాగిస్తున్నారు. రక్తదానానికి వయోపరిమితి లేకపోవడంతో పాటూ జోసెఫీన్ ఆరోగ్యం కూడా సహకరించడంతో ఆమె సమాజసేవను కొనసాగిస్తున్నారు.
నా పేరిట ఓ రికార్డు ఉంటుందని నేనెప్పుడూ ఊహించలేదు. అసలు రికార్డుల కోసం నేను రక్తదానం చేయట్లేదు. అయితే.. ఇక ముందు కూడా ఇదే మార్గంలో పయనిస్తా’’ అని ఆమె చెప్పుకొచ్చారు. జోసెఫీన్ బ్లడ్ గ్రూప్ ‘ఓ’ పాజిటివ్. అమెరికా ఆసుపత్రుల్లో ఈ బ్లడ్ గ్రూప్‌కు బాగా డిమాండ్ ఉంది. అమెరికా రెడ్ క్రాస్ నివేదిక ప్రకారం.. అమెరికా జనాభాలో 37 శాతం మంది బ్లడ్ గ్రూప్ ఇదే. అందుకే ఆమె అలుపెరగకుండా ఈ బృహత్తర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.