Pakistan Gold Rate: తులం బంగారం రూ.7 లక్షల పైమాటే.. పాక్ దరిద్రానికి ఇంతకంటే నిదర్శనం కావాలా?

Kaburulu

Kaburulu Desk

March 4, 2023 | 11:47 AM

Pakistan Gold Rate: తులం బంగారం రూ.7 లక్షల పైమాటే.. పాక్ దరిద్రానికి ఇంతకంటే నిదర్శనం కావాలా?

Pakistan Gold Rate: మన దాయాది శత్రుదేశం పాకిస్తాన్ ఇప్పుడు ఆర్ధికంగా ఘోరాతి ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఓవైపు ఆర్ధిక సంక్షోభం, మరోవైపు రాజకీయ అస్థిరతతో పాకిస్థాన్ సతమతమవుతోంది. ప్రభుత్వ ఖజానా మొత్తం ఖాళీ అయిపోగా.. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఏది కొనాలన్నా ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ ఆస్తులు అమ్మాలన్నా.. ఆర్ధిక సంక్షోభంతో కొనే నాధుడు కూడా లేడు. ఇక్కడ దరిద్రం గురించి చెప్పుకోవాలంటే బంగారం ధర ఒక్కటి చాలు.

పాకిస్తాన్ లో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. 24 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర పాకిస్థాన్ కరెన్సీలో రూ.2.06 లక్షలుగా ఉంది. అదే మన కరెన్సీలో అయితే సుమారు రూ.7 లక్షలుగా ఉందంటే అంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. అమెరికా డాలర్ తో పోల్చితే పాకిస్థాన్ రూపాయి విలువ దారుణంగా పడిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు స్థానిక మీడియా పేర్కొంది. ప్రస్తుతం డాలర్ తో పాక్ రూపాయి మారకం విలువ రూ.280కి పైన ట్రేడవుతోంది.

దివాళా కోరల్లో చిక్కుకోకుండా ఉండేందుకు పాక్ ప్రభుత్వం ఇటీవలే అంతర్జాతీయ ద్రవ్యనిధితో ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో పన్నులు బాగా పెంచేయగా, ధరలు కూడా ఆకాశాన్నంటేలా పెరిగిపోయాయి. పాక్ ప్రజలు ఇక్కడ కనీసం నిత్యావసరాలు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారు. ద్రవ్యోల్బణం 50 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. దీంతో ఫిబ్రవరి నెలలో అక్కడ ధరల సూచీ 31.6 శాతానికి చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో లీటర్ డీజిల్ ధర రూ.280కి చేరింది.

ఇక పాకిస్తాన్ అప్పుకోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీలంక పరిస్ధితే పాకిస్తాన్ కు కూడా వస్తుందని అంటున్నారు. దేశంలో ఉత్పత్తి చేసే ఇతర మెడిసిన్ ముడి సరుకు సైతం దిగుమతి చేసుకోలేని స్థితిలో పాకిస్తాన్ ఉంది.