AP Volunteers: వాలంటీర్లు మీరు దూరంగా ఉండాల్సిందే.. కలెక్టర్లకు మరోసారి ఎన్నికల సంఘం ఆదేశాలు!

Kaburulu

Kaburulu Desk

March 4, 2023 | 10:57 AM

AP Volunteers: వాలంటీర్లు మీరు దూరంగా ఉండాల్సిందే.. కలెక్టర్లకు మరోసారి ఎన్నికల సంఘం ఆదేశాలు!

AP Volunteers: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏపీలో వాలంటీర్ల ప్రస్తావన వస్తూనే ఉంటుంది. 90 శాతం మంది వాలంటీర్లు మన కార్యకర్తలేనని స్వయంగా ఆ పార్టీ నేతలే చెప్పడంతో వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉండాల్సిందేనని ప్రతిపక్షాల నుండి భారీ డిమాండ్లు వినిపించాయి. అందుకు తగ్గట్లే ఎలాంటి ప్రమాణాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం నియమించుకున్న వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని గతంలోనే ఎన్నికల సంఘం ఆదేశించింది.

అయితే క్షేత్రస్ధాయిలో ఆ ఆదేశాలు సంపూర్ణంగా అమలు కావడం లేదు. కలెక్టర్లు, డీపీవోలు, ఇతర అధికారులు ఆదేశాలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో అధికారులు వాలంటీర్లను కట్టడి చేసేందుకు భయపడుతున్నారు. దీంతో వాలంటీర్లపై మళ్లీ మళ్లీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. తగిన ఆధారాలతో విపక్షాలు చేస్తున్న ఫిర్యాదులకు కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పందించింది.

ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వాలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు మరోసారి రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. రాష్ట్రంలో ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు ఈ మేరకు వారిని కట్టడి చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆయన జిల్లా కలెక్టర్లకు మరోసారి లేఖలు రాశారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరారు.

ఇప్పటికే ప్రతిసారి ఎన్నికల సమయంలో ఇలాంటి ఆదేశాలే ఇచ్చామని, కానీ అమలు కాకపోవడంతో మరోసారి ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు కలెక్టర్లకు మీనా తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితులలో గ్రామ, వార్డు వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని.. వాలంటీర్లు ఎన్నికలకు సంబంధించి సహాయకులుగా కూడా వ్యవహరించడానికి వీల్లేదని కలెక్టర్లకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఆదేశించారు. మరి ఈసారైనా వాళ్ళని దూరంగా ఉంచగలుగుతారా? లేదా? అన్నది చూడాల్సిందే!