రాజాసింగ్ మళ్లీ అరెస్ట్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ అరెస్ట్ అయ్యారు. రాజాసింగ్‌ను మంగళహాట్ పోలీసులు అదుపులకి తీసుకున్నారు. రెండు రోజుల వ్యవధిలో ఆయన రెండో సారి అరెస్ట్ అయ్యారు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై దేశవ్యాప్తంగా 42 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన్ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేయగా బెయిల్ పై విడుదలయ్యారు. తాజాగా ఇప్పుడు మరోసారి అరెస్ట్ అయ్యారు రాజాసింగ్.
రాజాసింగ్ అరెస్ట్ కు ముందు పోలీసులు ఆయనకు సీఆర్పీసి 41 ప్రకారం నోటీసులు అందజేశారు. దీంతో ఆయన్ను మరోసారి అరెస్ట్ చేయడం ఖాయమని అప్పుడే భావించారు. అందుకు తగ్గట్టుగానే ఉదయం నుంచి రాజాసింగ్ నివాసాన్ని పోలీసులు భారీగా చుట్టుముట్టారు. మధ్యాహ్నం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఏ కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారనేది తెలియాల్సి ఉంది.
అంతకుముందు రాజాసింగ్ ఒక వీడియో విడుదల చేశారు. పాతబస్తీలో అల్లర్లు సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వానికి వంత పాడుతున్నారని విమర్శించారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానన్న రాజాసింగ్.. తనను బీజేపీ నుంచి బహిష్కరించినా పర్వాలేదన్నారు. ధర్మం కోసం తన ఎమ్మెల్యే పదవిని కూడా త్యాగం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు రాజాసింగ్ వెల్లడించారు.
రాజాసింగ్ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే భావనలో ఉంది. రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి పాతబస్తీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆరోజు నుంచి ఇప్పటి వరకూ ప్రతిరోజూ పాతబస్తీలో చిన్నాచితకా గొడవలు నడుస్తూనే ఉన్నాయి. రాజాసింగ్ అనుకూల, వ్యతిరేక వర్గాలు రోడ్లపై నిరసనలు చేపడుతున్నాయి. ఇది మరిన్ని ఘర్షణలకు దారితీసేందుకు కారణమవ్వచ్చని భావించిన ప్రభుత్వం రాజాసింగ్ ను మరోసారి అదుపులోకి తీసకుంది.