Jvalamukhi Temple:అగ్నిని అమ్మవారిగా భావించి పూజించే దేవాలయమేదో తెలుసా..?

Kaburulu

Kaburulu Desk

December 18, 2022 | 02:33 PM

Jvalamukhi Temple:అగ్నిని అమ్మవారిగా భావించి పూజించే దేవాలయమేదో తెలుసా..?

ఒక స్త్రీని శక్తి రూపంగా భావించి పూజించే సంస్కృతి మన హిందూ సంప్రదాయంలో తప్ప ఇంకెక్కడా కనిపించదు. అందుకే మన పెద్దలు “యత్రనార్యన్తు పూజ్యన్తే రమంతే తత్ర దేవతః” అన్నారు, అంటే స్త్రీ ఎక్కడైతే పూజించబడుతుందో అక్కడే అందరు దేవతలూ ప్రసిద్ధులవుతారు అని అర్థం. ఆ శక్తి రూపాన్నే మనం భవానీ, మహాంకాళి, అన్నపూర్ణ, చండి, హింగుళ, మహాలక్ష్మి, సరస్వతి, అంబిక వంటి ఎన్నో పేర్లతో పూజిస్తాం కానీ అగ్నినే ఒక శక్తిగా, అమ్మవారిగా భావించే ఆలయమొకటుందన్న విషయం తెలుసా…?

కాంగ్రా లోయలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రం ‘జ్వాలముఖి’ దేవాలయాన్ని ఉత్తర భారతీయులు జ్వాలాజీగా పిలుస్తుంటారు. సముద్ర మట్టానికి సుమారు 610మీటర్ల ఎత్తులో ఉన్న సిమ్లా -ధర్మశాల హైవేపై, కాంగ్రా పట్టణానికి సుమారు 30కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఇది 51శక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయంలో ఒక రాగి గొట్టం నుండి నిరంతరం సహజవాయువు వెలువడుతుంది. దీన్ని ఆలయ పురోహితుడు వెలిగిస్తాడు. ఈ జ్వాలే జ్వాలాముఖి అమ్మవారిగా పూజలందుకుంటోంది.

దక్ష యజ్ఞం అనంతరం సతీ దేవి శరీరాన్ని మోసుకెళ్తున్న శివుడి భుజంపై నుండి సతీ దేవి యొక్క ఒక్కో భాగం ఒక్కో చోట పడింది. అలానే ఇక్కడ సతీ దేవి నాలుక పడిందట, అందుకనే ఇక్కడ అమ్మవారు నాలుక చాస్తున్నట్లుగా నిరంతరం ఒక జ్వాల వెలువడుతూ ఉంటుంది. అనాదిగా విడవకుండా వెలుగుతున్న ఈ అగ్ని వెనుక కారణం ఏమిటో ఎవరికీ అంతుపట్టట్లేదట.