Holi in Menar: కత్తులతో, కాల్పులతో హోలీ జరుపుకునే వింత సంప్రదాయం ఎక్కడుందో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

March 11, 2023 | 01:52 PM

Holi in Menar: కత్తులతో, కాల్పులతో హోలీ జరుపుకునే వింత సంప్రదాయం ఎక్కడుందో తెలుసా…?

హోలీ అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది కామదహనం, రంగులతో ఆటలు… కానీ అంతకు భిన్నంగా, రకరకాల సంప్రదాయాలతో కొన్ని చోట్ల హోలీ జరుపుకుంటారు. అందులో ఒకటి కత్తులతో, తుపాకీ కాల్పులతో జరుపుకోవడం. ఉత్తరప్రదేశ్ లో ఒక ప్రాంతంలో తేళ్లతో హొలీ ఆడుకోగా.. ఓ చిన్న గ్రామంలో మాత్రం తుపాకీల మోతతో హోలీని జరుపుకుంది. హొలీ ఇలా జరుపుకోవడానికి కారణం పురాణం కాదు..  ధైర్య చరిత్ర.. సాహసోపేతమైన విజయానికి గుర్తు.. మరి ఇక్కడి హోలీ పండుగ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇపుడు తెలుసుకుందాం.

భారతదేశంలోని అన్ని  ప్రాంతాల్లో రంగులతో హోలీని జరుపుకుంటే.. రాజస్థాన్‌ ఉదయ్‌పుర్‌ జిల్లాలోని మెనార్‌ గ్రామంలో హోలీ వేడుకలను వినూత్నంగా జరుపుకున్నారు. హొలీ వేడుకల కోసం రంగులను కాకుండా గన్స్ ను వినియోగించారు. వేడుకల్లో భాగంగా పురుషులు తుపాకుల్లో గన్ పౌడర్ ను నింపి గాలిలోకి కాల్పులు జరిపారు.  చేతిలో కత్తి , కర్రను పట్టుకుని ‘గైర్’ నృత్యం చేశారు. మహిళలు వీరత్వం, పరాక్రమం పాటలు పాడతారు. మెనార్ లో బ్రాహ్మణ జనాభా అధికం. ఇక్కడ హోలీని విభిన్నంగా జరుపుకుంటారు.

ఈ వేడుకల్లో భాగంగా తుపాకుల్లో గన్‌పౌడర్‌ను నింపి గాల్లోకి కాల్పులు జరుపుతారు. భారీ బాణసంచా కాలుస్తారు. ఈ విధంగా హోలీని జరుపుకోవడం వెనుక ఓ చారిత్రక కారణం ఉందని చెబుతున్నారు స్థానికులు. మెనార్ లో ఏటా హోలీ తర్వాతి రోజున దీన్ని నిర్వహిస్తారు.  ఈ వేడుకల కోసం సుదూర ప్రాంతాల నుండి ప్రేక్షకులు వస్తారు. కొన్ని శతాబ్దాల క్రితం మొఘల్ సైన్యంపై పోరాడి గెలిచిన విజయానికి గుర్తుగా బ్రాహ్మణులు ‘బరూడోన్-కి-హోలీ’ ఆడుకుంటారు. సుమారు 500 ఏళ్ల నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నామని చెబుతున్నారు. హొలీ మర్నాడు ప్రధాన ఓంకారేశ్వర కూడలిని దీపాలతో అలంకరించారు. రోజంతా, డ్రమ్మర్ డోలును కొడుతూనే ఉన్నారు. మధ్యాహ్నం, 1 గంట ప్రాంతంలో, మేవార్ రాజులు గ్రామానికి సమర్పించిన రెడ్ కార్పెట్ చౌరస్తాలో శాశ్వత వేదిక వద్ద ఏర్పాటు చేశారు. 52 గ్రామాల ప్రతినిధులు రాజస్థాన్ సంప్రదాయ దుస్తులను ధరించి, పండుగను ఘనంగా నిర్వహిస్తారు.