Pubjab Tornado: పంజాబ్‌లో విరుచుకుపడిన టోర్నడో.. 50 ఇళ్లు ధ్వంసం.. 12 మందికి గాయాలు

Kaburulu

Kaburulu Desk

March 25, 2023 | 05:55 PM

Pubjab Tornado: పంజాబ్‌లో విరుచుకుపడిన టోర్నడో.. 50 ఇళ్లు ధ్వంసం.. 12 మందికి గాయాలు

Pubjab Tornado: అమెరికాలో టోర్నడోలు భీభత్సం సృష్టించడం మనం తరచుగా చదువుతుంటాం. శుక్రవారం రాత్రి కూడా అమెరికాలో టోర్నడో బీభత్సం సృష్టించింది. లాస్‌ ఏంజెల్స్‌, కాలిఫోర్నియా రాష్ట్రంలో టోర్నడో భీభత్సం సృష్టించింది. లాస్‌ ఏంజిల్స్ సమీపంలోని మోంటెబెల్లో నగరాన్ని ఈ టోర్నడో కుదిపేసింది. టోర్నడో ప్రభావంతో భారీగా గాలిదుమారం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టేసింది. ఇళ్లు, వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదలా ఉండగానే ఇండియాలో కూడా టోర్నడో విరుచుకుపడింది.

పంజాబ్ రాష్ట్రంలోని ఫజిల్కా జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఓ గ్రామంపై టోర్నడో విరుచుకుపడింది. టోర్నడో ప్రభావంతో సుమారు 12 మంది గాయపడినట్టు, 50 ఇళ్లు దెబ్బతిన్నట్టు, పంటలకు నష్టం వాటిల్లినట్టు స్థానిక మీడియా కథనాల ద్వారా సమాచారం. గురు, శుక్రవారాల్లో పంజాబ్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. వాతావరణ మార్పులలో భాగంగానే టోర్నడో కూడా గ్రామంపై విరుచుకుపడింది.

పంజాబ్ లో వారం వ్యవధిలో వచ్చిన రెండో టోర్నడో ఇదని వెదర్ మ్యాన్ నవ్ దీప్ దహియా అనే ట్విట్టర్ యూజర్ పేర్కొన్నారు. వాతావరణంలో అనూహ్యమైన మార్పులు, ఉరుములతో కూడిన వాన, బలమైన గాలులు రావడంతో ఇవన్నీ కలసి టోర్నడో ఏర్పడడానికి దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఉరుములతో కూడిన వానకు, భిన్నమైన దిశలో గాలి తోడైనప్పుడు టోర్నడోలు వస్తుంటాయి.

నిజానికి పంజాబ్ లో వచ్చింది తేలిక పాటి టోర్నడోనే. అమెరికాలో దీనికి ఎన్నో రెట్లు బలమైనవి వస్తుంటాయి. క్యుములోనింబస్ మేఘాలు, భూమికి మధ్య అనుసంధానంగా బలమైన గాలి తోడయ్యి ఓ వలయం మాదిరిగా చాలా వేగంగా కదులుతూ ఉంటుంది. మన దేశంలో ఇవి చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా పంజాబ్ లోనే 2007 నుంచి చూస్తే ఇది నాలుగో టోర్నడో కావడం గమనించొచ్చని ట్విట్టర్ ద్వారా అందిన సమాచారం.