Anakapalle District: కన్న తల్లికి నీడ కరువు.. తల్లి ఇంటిని కూల్చేసి పగ తీర్చుకున్న కొడుకు!

Anakapalle District: ఈ లోకంలో మన నుండి ఏదీ ఆశించకుండా.. తాను త్యాగం చేసి మరీ ప్రేమ చూపే వ్యక్తి తల్లి ఒక్కరే. తల్లి ప్రేమను ఎవరూ విలువకట్టలేరు. ఈ ప్రపంచంలో తల్లి పిల్లలపై చూపించినంత ప్రేమ ఇంకెవరూ ఎవరిపైనా చూపించలేరు. తాను తిన్నా తినకపోయినా పిల్లల ఆకలి గురించే తల్లి ఆరాటం మొత్తం. బిడ్డకు ఏదన్నా చిన్న గాయమైతే తల్లి గుండె తట్టుకోలేదు. తల్లికి తనకంటూ ఓ ప్రపంచం ఉందంటే అది పిల్లలు మాత్రమే. అంతగా అల్లారు ముద్దుగా పెంచిన పిల్లలే ఆ తల్లుల పాలిట నరకమవుతున్నారు.
వృద్ధులైన తర్వాత ఆ తల్లులను మర్చిపోతున్న పిల్లలు కొందరైతే.. ఆస్థి కోసం వాటాలలో తేడాలొచ్చాయని ఆ తల్లి కూడా వీధిపాలు చేసే వారు మరికొందరు. అలాంటి ఘటనే ఇది. తల్లి పోయాక తనకు దక్కదేమోనని తల్లి ఉండగానే ఆ ఇంటిని కూల్చేసి తల్లిని వీధిపాలు చేశాడో కొడుకు. ఈ దారుణమైన ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం రాజుపేటకు చెందిన నాగమ్మ అనే 68 ఏళ్ల వృద్ధురాలు డాబా ఇంటిలో ఒంటరిగా నివాసం ఉంటుంది.
ఆమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కాగా వారందరికి వివాహలై ఎవరికి వారే బ్రతుకుతున్నారు. నాగమ్మ ఒంటరిగా జీవనం సాగిస్తుండగా కుమార్తెలో ఒకరైన రమణమ్మ తల్లి బాగోగులు చూసుకుంటోంది. దీంతో తన తదనంతరం తానుండే ఇంటిని కుమార్తె రమణమ్మకే చెందేలా ఓ నెల రోజుల క్రితం నాగమ్మ రిజిస్ట్రేషన్ చేసింది. అయితే ఆ విషయంలో కుమారులో ఒకరైన తాతారావుకు తెలిసింది.
దీంతో కొడుకు, మనుమడు శ్రీను కలసి మార్చి 12న పొక్లెయిన్ తో నాగమ్మ ఇంటిని కూల్చేశారు. వృద్దాప్యంతో బాధపడుతున్న తనకు నిలువ నీడ లేకుండా చేశారని ఆమె వాపోయింది. తనకు న్యాయం చేయాలని మనుగపాక పోలీసులకు, ఎమ్మార్వోకు సైతం నాగమ్మ తన బాధను వ్యక్తం చేసి ఫిర్యాదు చేశారు. అధికారులు ఎవ్వరూ పట్టించుకోలేదని నాగమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన మునగపాక ఎస్సై మహమ్మద్ ఆలీ.. ఇల్లు కూల్చివేతపై ఫిర్యాదు అందిందని, వారు కుటుంబ సభ్యులతో చర్చించుకుంటామని తెలపడంతో కేసులు నమోదు చేయలేదని తెలిపారు.