Babu Mohan: నువ్వెంత నీ బతుకెంత.. బీజేపీ కార్యకర్తపై బాబూమోహన్ బూతుపురాణం!

Kaburulu

Kaburulu Desk

February 7, 2023 | 03:10 PM

Babu Mohan: నువ్వెంత నీ బతుకెంత.. బీజేపీ కార్యకర్తపై బాబూమోహన్ బూతుపురాణం!

Babu Mohan: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతుంటే రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఈసారి ఎలాగైనా బీజేపీ అధికార పీఠాన్ని దక్కించుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తుంది. బీజేపీ నేతలు ఈసారి చావో రేవో అనేలా సిద్దపడుతున్నారు. ఇలాంటి తరుణంలో మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు బాబూ మోహన్ ఓ బీజేపీ కార్యకర్తపై కోపంతో ఊగిపోతూ బూతు పురాణంతో రెచ్చిపోయిన ఆడియో ఒకటి వైరల్ అవుతుంది.

జోగిపేటకు చెందిన బీజేపీ కార్యకర్త వెంకటరమణ బాబుమోహన్‌కు ఫోన్ చేశారు. ”చెప్పు తమ్ముడు” అంటూ బాగానే రిసీవ్ చేసుకున్న బాబుమోహన్. కొద్ది సేపటి తర్వాత రెచ్చిపోయారు. ”మీతో కలిసి పని చేయడం కోసం ఫోన్ చేశా”నని వెంకటరమణ చెప్పడంతో బాబుమోహన్‌కు కోపం వచ్చింది. కలిసి పనిచేయడానికి నువ్వెంత..? నీ బతుకెంత..? అంటూ బూతులందుకున్నారు. తానో ప్రపంచ స్థాయి నాయకుడినని.. తనను బీజేపీ కోసం అమిత్ షానే పార్టీలో చేర్చుకున్నారని చెప్పారు.

మధ్యలో బండి సంజయ్‌ ప్రస్తావన రాగా… ”బండి సంజయ్‌ ఎవడ్రా?.. వాడు నా తమ్ముడు” అంటూ మాట్లాడారు. తాను ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నానని, ఒక కార్యకర్తతో ఇలాగేనా మాట్లాడేది అని వెంకటరమణ చెప్పినా బాబుమోహన్ పట్టించుకోలేదు. ‘నీ వయస్సు ఎంత? జోగిపేటకు నువ్వేం చేయగలవు? నీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి? నీ స్థాయి ఎంత? నువ్వు నాతో మాట్లాడ్డానికి అనర్హుడివి’’ అంటూ విరుచుకుపడ్డారు.

ఇంకోసారి ఫోన్ చేస్తే జోగిపేటలో చెప్పు తీసుకుని కొడతా అంటూ దూషించారు. ఒక సందర్బంలో అవసరమైతే రేపు బీజేపీకి కూడా రాజీనామా చేస్తా అంటూ మాట్లాడారు. ”నా మాటలను రికార్డు చేస్తే చేసుకోరా.. ఫోన్‌ పెట్టేయ్‌రా.. గాడిద.. వెధవ” అంటూ బూతులు తిట్టారు. సోషల్ మీడియాలో ఈ ఆడియో వైరల్ అవుతోంది. ఫోన్ సంభాషణలో పదేపదే బూతులు వాడారు బాబుమోహన్.