IND vs AUS 1st Test Match: మూడు రోజుల్లోనే ముగించేశారు.. తొలిటెస్టులో ఆసీస్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం ..

Kaburulu

Kaburulu Desk

February 11, 2023 | 09:03 PM

IND vs AUS 1st Test Match: మూడు రోజుల్లోనే ముగించేశారు.. తొలిటెస్టులో ఆసీస్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం ..

IND vs AUS 1st Test Match: ప్ర‌తిష్టాత్మ‌క బోర్డ‌ర్ – గ‌వాస్క‌ర్ ట్రోఫీని టీమిండియా ఘ‌నంగా ఆరంభించింది. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొద‌టి టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్‌పై ఘ‌న విజ‌యం సాధించింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో మూడు రోజుల్లోనే టీమిండియా ఆట‌గాళ్లు మ్యాచ్‌ను ముగించేశారు. మూడోరోజు 321 ప‌రుగుల ఓవ‌ర్‌నైట్ స్కోర్‌తో క్రీజ్‌లోకి వ‌చ్చిన ర‌వీంద్ర జ‌డేజా, అక్ష‌ర్ ప‌టేల్‌లు దూకుడ‌గా ఆడే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో ఆట ప్రారంభ‌మైన కొద్దిసేప‌టికే ర‌వీంద్ర జ‌డేజా(70) ఔట్ అయ్యాడు. ఆ త‌రువాత క్రీజ్‌లోకి వ‌చ్చిన మ‌హ్మ‌ద్ ష‌మీ దూకుడుగా ఆడి 47 బాల్స్‌లోనే 37 ప‌రుగులు చేశారు. మార్ఫీ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజ్‌లోకి వ‌చ్చిన సిరాజ్‌తో క‌లిసి ప‌రుగులు రాబ‌ట్టేందుకు అక్ష‌ర్ ప‌టేల్ (84) ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ భార‌త్ 400 స్కోర్ వ‌ద్ద క‌మిన్స్ బౌలింగ్‌లో ఔట్ కావ‌టంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్‌పై 223 ప‌రుగుల‌ ఆధిక్యాన్ని సాధించింది. ఆ త‌రువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ బ్యాటింగ్ లైన‌ప్‌ను స్పిన్న‌ర్లు అశ్విన్‌, జ‌డేజా ధ్వ‌యం కుప్ప‌కూల్చింది. ముఖ్యంగా అశ్విన్ అద్భుత బౌలింగ్‌కు ఆస్ట్రేలియా బ్యాట‌ర్లు వ‌రుస‌గా పెవిలియ‌న్ బాటప‌ట్టారు.

 

రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌కు రెండో ఓవ‌ర్లోనే ఎదురుదెబ్బ త‌గిలింది. అశ్విన్ వేసిన రెండో ఓవ‌ర్లో ఓపెన‌ర్ ఖ‌వాజా (5) స్లిప్ లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ త‌రువాత క్రీజ్‌లోకి వ‌చ్చిన ల‌బుషేన్ దూకుడుగా ఆడే ప్ర‌య‌త్నం చేశాడు. జ‌డేజా వేసిన 11వ ఓవ‌ర్లో లబుషేన్ (17) ఔట్ అయ్యాడు. స్మిత్ క్రీజ్‌లోకి వ‌చ్చాడు. స్మిత్‌, వార్న‌ర్ ఇన్నింగ్స ను చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేయ‌గా.. అశ్విన్ వేసిన 14వ ఓవ‌ర్లో వార్న‌ర్ (10) ఔట్ కావ‌టంతో 35 ప‌రుగుల‌కు ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయింది. ఆత‌రువాత వ‌రుస‌గా వికెట్లు ప‌డ్డాయి. ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఎవ్వ‌రూ క్రీజ్‌లో ఎక్కువ సేపు నిల‌వ‌లేక పోయారు. రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్ (25) నాటౌట్ మిన‌హా ఎవ‌రూ 20 ప‌రుగులు దాట‌లేదు. చివ‌రి రెండు వికెట్లు మ‌హ్మ‌ద్ ష‌మీ తీయ‌డంతో ఆసిస్ కేవ‌లం 91 ప‌రుగులు మాత్ర‌మే చేసిన ఆలౌట్ అయింది. దీంతో తొలి టెస్టు మ్యాచ్‌లో భార‌త్ 132 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. అశ్విన్ ఐదు వికెట్లు తీయ‌గా, జ‌డేజా, ష‌మీ త‌లా రెండు వికెట్లు, అక్ష‌ర్ ప‌టేల్ ఒక వికెట్ తీశారు.

 

మొద‌టి, రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఇండియా బౌల‌ర్ల స్పిన్‌ ధాటికి ఏమాత్రం క్రీజ్‌లో నిల‌వ‌లేక పోయారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 177, రెండో ఇన్నింగ్స్‌లో 91 ప‌రుగుల‌కే ఆసీస్ ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి, 70 ప‌రుగులు, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసిన జ‌డేజాకు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది. అయితే టెస్టుల్లో ఆసీస్‌పై భార‌త్‌కు ఇది మూడో అతిపెద్ద విజ‌యం.