Gadapa Gadapaku: మాజీ మంత్రి అవంతికి చెప్పుల దండతో స్వాగతం.. భీమిలిలో ఉద్రిక్తతలు

Gadapa Gadapaku: ఏపీలో వైసీపీ గడప గడపకు కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమం మొదలు పెట్టగా.. ప్రజాక్షేత్రంలో ఒక్కోసారి ఎమ్మెల్యే, మంత్రులకు సైతం ప్రజల నుండి ప్రతిపక్షాల నుండి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు సొంత నియోజకవర్గంలో స్థానికులు ఝలక్ ఇచ్చారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అవంతి విశాఖ జిల్లా భీమిలి మండలం కె.నగరపాలెం వెళ్లారు. అయితే, ఎమ్మెల్యే తమ గ్రామానికి రాకుండా ఆ గ్రామ టీడీపీ మాజీ అధ్యక్షుడు తొత్తడి సూరిబాబు, మరికొందరు స్థానికులు కలిసి రోడ్డుకు అడ్డంగా పాత చెప్పుల దండ కట్టారు. ఈ విషయం తెలియడంతో పోలీసులు వెళ్లి దాన్ని తొలగించారు.
అనంతరం సూరిబాబును అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాటలు జరిగి ఘర్షణకి దారితీసింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకోవడం పరిస్థితి సద్దుమణిగింది. తర్వాత మాజీ మంత్రి అవంతి తన కార్యక్రమాన్ని కొనసాగించారు.
నిజానికి ఇక్కడ ఇళ్ల స్థలాల అంశంలో స్థానికులు రెండు వర్గాలుగా విడిపోయారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉండగా.. స్థానికులు చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అయితే.. ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోకపోవడంతోనే ఇక్కడ ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నేతలు ఎమ్మెల్యేను తమ గ్రామానికి రావద్దని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులు అదే గ్రామంలోని వైసీపీ కార్యకర్తల అండతో అవంతి ఇక్కడ గడప గడపకి ప్రభుత్వం కార్యక్రమాన్ని పూర్తి చేశారు.