Mohan Babu: మంచు కుటుంబంతో వైసీపీ ఎంపీ గోరంట్ల భేటీ.. దేని గురించి చర్చ జరిగిందో?

Kaburulu

Kaburulu Desk

January 8, 2023 | 01:59 PM

Mohan Babu: మంచు కుటుంబంతో వైసీపీ ఎంపీ గోరంట్ల భేటీ.. దేని గురించి చర్చ జరిగిందో?

Mohan Babu: శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా హిందూపురం లోక్‌సభ సభ్యుడు గోరంట్ల మాధవ్.. సినీ నటుడు, వైసీపీ నేత అయిన మంచు మోహన్ బాబును కలిశారు. ఈ సమయంలో మోహన్ బాబుతో పాటు మంచు ఫ్యామిలీ అంతా ఉన్నారు. దీంతో ఈ సమావేశంలో దేనిపై చర్చ జరిగింది?.. రాజకీయాల గురించి ఏమైనా చర్చించారా? అన్నది ఆసక్తిగా మారింది. పేరుకు వైసీపీలో ఉన్నా మోహన్ బాబు ఫ్యామిలీ రాజకీయాలలో ఎక్కడా కనిపించడం లేదు. అంతకు ముందు ఫీజు రీయంబర్స్ మెంట్ విషయంలో టీడీపీపై తీవ్ర ఆరోపణలకు దిగిన మోహన్ బాబు ఒకదశలో రోడ్డుపై కూర్చొని నిరసన కూడా తెలియజేశారు.

ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి పార్టీలో చేరి గత ఎన్నికలలో వైసీపీ కోసం పనిచేశారు. అయితే.. ఆ తర్వాత ఒకటి రెండు చోట్ల మినహా మోహన్ బాబు రాజకీయాలలో కనిపించడం లేదు. మరోవైపు సినిమాలలో కూడా ఆయన ఛరిస్మా తగ్గిపోవడంతో ఎక్కువగా ఆయన స్వస్థలమైన తిరుపతిలో గల విద్యాసంస్థల వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఈ మధ్యనే అక్కడ షిర్డీ సాయినాధుని ఆలయం కూడా నిర్మించారు. తిరుపతి సమీపంలోని రంగంపేట క్రాస్ వద్ద మోహన్ బాబుకు చెందిన శ్రీవిద్యానికేతన్, యూనివర్శిటీ పరిసరాల్లోనే ఈ ఆలయం నిర్మితమైంది.

గత ఏడాది శ్రావణ మాసంలో ఈ ఆలయాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించిన మోహన్ బాబు.. మూడు రోజుల పాటు యజ్ఞ యాగాదులను కూడా నిర్వహించారు. ఆగస్టు 11వ తేదీన సాయినాథుడి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని పూర్తి చేయగా.. కొత్త సంవత్సరంలో కూడా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షణాదిలోనే అతిపెద్ద సాయిబాబా ఆలయంగా నిర్మించిన ఈ ఆలయానికి వీఐపీలు కూడా కొందరు దర్శించుకుంటున్నారు.

అలాంటి క్రమంలోనే ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఆలయ సందర్శనకి వెళ్లారు. అయితే.. దీంతో పాటు మోహన్ బాబుతో కూడా గోరంట్ల భేటీ అయ్యారు. మరి ఈ భేటీలో రాజకీయాల ప్రస్తావన వచ్చిందా? లేదా? వస్తే మోహన్ బాబు ఎలా స్పందించారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. వైసీపీపై అసంతృప్తితోనే మోహన్ బాబు పార్టీకి దూరంగా ఉంటున్నారని టాక్ నడుస్తుంది. అలాంటిది రానున్న ఎన్నికల సమయానికి మంచు అండ్ కో రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా కనిపిస్తుంది.