Nellore: యువకుడి సెల్ఫీ సరదా.. తాచుపాము మెడలో వేసుకుంటే ఊరికే ఉంటుందా?

Kaburulu

Kaburulu Desk

January 26, 2023 | 10:31 AM

Nellore: యువకుడి సెల్ఫీ సరదా.. తాచుపాము మెడలో వేసుకుంటే ఊరికే ఉంటుందా?

Nellore: సెల్ఫీ.. ఇప్పుడిది ఒక ఫ్యాషన్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ సెల్ఫీ పిచ్చిలో పడి యువత తమ ప్రాణాలను బలితీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వెరైటీ ఫోటోలు పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు చివరికి వారి ప్రాణాలకే ప్రమాదంగా మారుతున్నాయి. కానీ, యువతలో మార్పు రావడం లేదు. వింత వింత ఫోటోల కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాజాగా సెల్ఫీ పిచ్చి ఓ యువకుడు తన నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ విషాదకర ఏపీలోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా తాళ్లూరుకు చెందిన మణకంఠ రెడ్డి అనే యువకుడు పూర్వ ప్రకాశం ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కలిసిన కందుకూరులో జ్యూస్‌ దుకాణం నిర్వహిస్తుంటాడు. పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలో ఈ జ్యూస్ దుకాణం ఉండగా అక్కడికి మంగళవారం రాత్రి పాములు ఆడించే ఓ వ్యక్తి వచ్చాడు. అక్కడే ఉన్న మణికంఠ.. పాములు ఆడించే వ్యక్తి చేతిలోని పామును తన మెడలో వేసుకొని సెల్ఫీ దిగాలని చూశాడు. దానికి పాములు ఆడించే అతను కూడా సరే అనడంతో సెల్ఫీ అయితే దిగాడు.

తర్వాత పామును కిందికి దించుతున్న సమయంలో అది కాటు వేసింది. దీంతో స్థానికులు యువకుడిని ముందుగా కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి సీరియస్ కావడంతో మళ్ళీ ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. కానీ, మార్గ మధ్యలోనే మణికంఠ మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాము కాటుతో చనిపోయిన విషయాన్ని డాక్టర్లు మృతుని తల్లిదండ్రులకు తెలియజేయడంతో షాక్ అయ్యారు.

పాముతో సెల్ఫీలు దిగిన విషయం తెలిస్తే తల్లిదండ్రులు తిడతారని కందుకూరు ఆసుపత్రిలోనే తన సెల్‌ఫోన్‌లో ఉన్న పాము సెల్ఫీ ఫోటోలు డిలీట్ చేసినట్లుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా, ఐదేళ్ల క్రితమే మణికంఠరెడ్డి సోదరుడు ఇంద్రారెడ్డి కిడ్నీ సంబంధిత సమస్యతో చనిపోగా.. మణికంఠ ఇప్పుడిలా చనిపోయాడు. చేతికి అందొచ్చిన ఇద్దరు కొడుకులు దూరమైన ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం.