SDSC: మొన్న ఇద్దరు.. నేడు మరొకరు ఆత్మహత్య.. స్పేస్ సెంటర్‌లో ఏం జరుగుతుంది?

Kaburulu

Kaburulu Desk

January 18, 2023 | 04:26 PM

SDSC: మొన్న ఇద్దరు.. నేడు మరొకరు ఆత్మహత్య.. స్పేస్ సెంటర్‌లో ఏం జరుగుతుంది?

SDSC: పూర్వపు నెల్లూరు జిల్లాలోని ప్రస్తుత తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. మొన్న ఇద్దరు సీఐఎస్ఎఫ్ సిబ్బంది 24 గంటలలోనే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపగా.. మొన్న చనిపోయిన ఎస్సై భార్య.. భర్త మృతదేహాన్ని చూసేందుకు వచ్చి ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. అంతకు ముందే ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోగా.. ఆ తర్వాత రోజే ఎస్సై.. ఇప్పుడు ఎస్సై భార్య బలవన్మరణంతో స్పేస్ సెంటర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ జవాన్ వికాస్ సింగ్ సోమవారం నాడు రాత్రి గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోగా అంతకు ముందు ఆదివారం సాయంత్రం చింతామణి అనే జవాన్ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం మహాసమంద్ జిల్లా శంకర గ్రామానికి చెందిన చింతామణి (29) ఇటీవల నెల రోజులపాటు సెలవుపై ఇంటికెళ్లిన ఈ నెల 10న తిరిగొచ్చి విధుల్లో చేరిన చింతామణి ఏమైందో కానీ అదే రోజు సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇక, షార్ మొదటి గేటు వద్ద కంట్రోల్ రూములో విధుల్లో ఉన్న ఎస్సై వికాస్ సింగ్ తన తుపాకితో తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 30 ఏళ్ల వికాస్ సింగ్‌ది ఉత్తరప్రదేశ్ కాగా ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా, ఆత్మహత్యకు పాల్పడిన సీఐఎస్ఎఫ్‌ ఎస్సై వికాస్‌ సింగ్‌ భార్య కూడా ఆత్మహత్య చేసుకుంది. భర్త వికాస్‌ సింగ్‌ ఆత్మహత్యతో నిన్న బీహార్‌ నుంచి అన్నతో కలిసి భర్తను చూడడానికి వచ్చిన ఆమె.. మనస్థాపానికి గురై ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు.

రాత్రి నర్మదా గెస్ట్‌హౌస్‌లో బస చేసిన ఎస్సై భార్య తెల్లవారేసరికి శవమై కనిపించింది. నర్మద గెస్ట్‌ హౌస్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. వికాస్‌ సింగ్‌కు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉండగా.. కుమారుడు ఒకటో తరగతి, కుమార్తె ఎల్‌కేజీ, మరో కుమార్తె చిన్నపాప. ఇందులో ఓ కుమార్తె వికలాంగురాలు కాగా ఇప్పుడు ఆ చిన్నారులు అనాథలయ్యారు. ఒకవైపు వికాస్‌ సింగ్‌ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతోన్న సమయంలో.. ఆయన భార్య కూడా ప్రాణాలు తీసుకోవడం కలకలం సృష్టిస్తుంది.