BRS-BJP: మొన్న కేటీఆర్.. నేడు బండి.. ముందస్తు ఎన్నికలపై సవాళ్లు.. ప్రతిసవాళ్లు!

Kaburulu

Kaburulu Desk

January 29, 2023 | 02:45 PM

BRS-BJP: మొన్న కేటీఆర్.. నేడు బండి.. ముందస్తు ఎన్నికలపై సవాళ్లు.. ప్రతిసవాళ్లు!

BRS-BJP: తెలంగాణలో ఎన్నికల వేడి ఎప్పుడో మొదలైంది. ఒకపక్క సీఎం కేసీఆర్ తన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా జాతీయ స్థాయిలో రాజకీయాలు మొదలు పెట్టి పార్టీ విస్తరణలో పనిలో ఉండగా.. బీజేపీ ఎలాగైనా తెలంగాణలో అధికార పీఠాన్ని దక్కించుకోవాలని పావులు కదుపుతుంది. షాడో సీఎంగా పేరున్న మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు బీజేపీకి కౌంటర్లు ఇస్తూ రాజకీయ వేడి పెంచేస్తున్నారు.

దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేసి రండి.. మేం అసెంబ్లీ రద్దు చేస్తాం.. ముందస్తు ఎన్నికలకు అందరం కలిసే పోదాం.. అంటూ కేంద్రంలోని బీజేపీ సర్కారుకు సవాల్ విసిరారు కేటీఆర్. నిజామాబాద్ వేదికగా కేటీఆర్ ఇలా ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ నుంచి కేంద్ర రూపాయి తీసుకుని.. తిరిగి రాష్ట్రానికి కేవలం 46 పైసలే ఇస్తోందని.. తాను చెప్పిన ఈ లెక్క తప్పు అయితే రాజీనామాకు కూడా సిద్ధమని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు.

కేటీఆర్ సవాల్ పై అప్పటి నుండే బీజేపీ కౌంటర్లు మొదలయ్యాయి. కాగా, ఇప్పుడు తాజాగా మేము కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ మంత్రి కేటీఆర్‌ కు ప్రతి సవాల్‌ విసిరారు. ముందస్తు ఎన్నికలకు మేం కూడా సిద్ధం, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమేనని బండి సంజయ్ అన్నారు. అయితే, ఆ మాట కేటీఆర్ తన తండ్రితో చెప్పించాలని సవాల్ విసిరారు.

అంతేకాదు, 24 గంటల విద్యుత్ ఇస్తున్నారని నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. తెలంగాణ అభివృద్ధిపై మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని.. చర్చకు మీరు సిద్ధమా? అంటూ సవాళ్ల వర్షం కురిపించారు. మా పార్టీలో కోవర్టులు ఉండరని.. తెలంగాణలో అభివృద్ధి.. ఆదాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని బండి డిమాడ్ చేశారు. రైతుల ఆత్మహత్యలో తెలంగాణ నాలుగవ స్థానంలో ఉందని మరోసారి గుర్తుచేశారు బండి సంజయ్‌. మొత్తంగా అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లు తారాస్థాయికి చేరుకున్నాయి. మరి, ఇవన్నీ స్వీకరించే సవాళ్లేనా?