Pawan-Chandrababu: చంద్రబాబును కలిసిన పవన్.. సంక్రాంతి మామూళ్ల కోసమేనన్న వైసీపీ!

Kaburulu

Kaburulu Desk

January 8, 2023 | 05:07 PM

Pawan-Chandrababu: చంద్రబాబును కలిసిన పవన్.. సంక్రాంతి మామూళ్ల కోసమేనన్న వైసీపీ!

Pawan-Chandrababu: జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరిగింది. పవన్ కు ఎదురెళ్లి గుమ్మం వద్ద చంద్రబాబు స్వాగతం పలికారు. ఇటీవల కుప్పంలో జరిగిన ఘటనల దృష్ట్యా చంద్రబాబుకు పవన్ సంఘీభావం తెలిపారు. అనంతరం ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ బలోపేతానికి పేరుతో ఐక్య కార్యాచరణ రూపొందించే అంశంపై వీరిద్దరూ మాట్లాడుకున్నట్లు సమాచారం ఒకటి బయటకి వదిలేవారు.

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలని ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు ప్రకటించిన నేతలు.. కొద్దినెలల క్రితం విజయవాడలోని ఓ హోటల్లో సమావేశమై పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. కాగా, ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్-1పైనా తాజా భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్ని కల్లో టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో చంద్రబాబు, పవన్ తాజా భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

కాగా.. ఈ భేటీ అధికార వైసీపీ పార్టీ నేతలు తీవ్ర విమర్శలకు దిగారు. ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్విటర్ మాధ్యమంగా వీరి భేటీపై స్పందిస్తూ.. సంక్రాంతి పండుగ మామూళ్ల కోసం దత్తతండ్రి చంద్రబాబు వద్దకు దత్తపుత్రుడు పవన్ కల్యా ణ్ వెళ్లాడంటూ సెటైర్స్ వేశారు. అలాగే.. మంత్రి అంబటి రాంబాబు సైతం ఘాటుగా రియాక్ట్
అయ్యారు. సంక్రాంతికి అందరి ఇంటికి గంగిరెద్దులు వెళ్తాయని.. ఇక్కడ చంద్రబాబు ఇంటికి బసవన్నలా పవన్ వెళ్లారన్నారు.

మంత్రి కారుమూరి కూడా పవన్, బాబుల భేటీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు, పవన్‌ల కలయిక కొత్తేమీ కాదని.. ఇద్దరూ ఎప్పటినుంచో కలిసే ఉన్నారని అన్నారు. రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి వీళ్లకు అవసరం లేదని ఆరోపించారు. మల్లాది విష్ణు సైతం చంద్రబాబు, పవన్‌లది అపవిత్ర కలయిక అని వ్యాఖ్యానించారు. తాజా భేటీతో పవన్, చంద్రబాబుల ముసుగు పూర్తిగా తొలగిపోయిందని.. వీరి భేటీతో రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. ఈ భేటీపై మంత్రి జోగి రమేశ్ కౌంటర్ల వర్షం కురిపించారు. సంక్రాంతి ప్యాకేజ్ కోసమే చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లాడన్నారు.