TDP vs YSRCP: వైసీపీ టీడీపీ రాళ్ల దాడి.. చిత్తూరు జిల్లాలో హై టెన్షన్!

Kaburulu

Kaburulu Desk

January 8, 2023 | 10:08 AM

TDP vs YSRCP: వైసీపీ టీడీపీ రాళ్ల దాడి.. చిత్తూరు జిల్లాలో హై టెన్షన్!

TDP vs YSRCP: చిత్తూరు జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అధికార వైసీపీ పార్టీ వర్గాలు.. ప్రతిపక్ష టీడీపీ వర్గాల మధ్య రాళ్ళ దాడి నేపథ్యంలో ఎప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుందోనని ఉత్కంఠ నెలకొంది. ఆ మాటకొస్తే టీడీపీ అధినేత పర్యటనకు వెళ్లిన దగ్గర నుండి జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం పర్యటనకి వెళ్లడం.. పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకోవడంతో ఇక్కడ కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపు టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. వైసీపీ శ్రేణులు ఒక చోట టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేయడంతో ఇది మరికాస్త వివాదానికి దారి తీసింది. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచెర్ల బస్టాండు సమీపంలో టీడీపీ నాయకులు భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే, ఈ ఫ్లెక్సీలను శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చించివేయగా శనివారం ఉదయం ఈ విషయాన్ని టీడీపీ కార్యకర్తలు గుర్తించారు.

అయితే, స్థానిక వైసీపీ జడ్పీటీసీ సభ్యుడు రెడ్డీశ్వర్‌రెడ్డి వర్గీయులే ఈ పనికి పాల్పడి ఉంటారని అనుమానించిన టీడీపీ నేతలు వారిని ప్రశ్నించారు. అక్కడ స్వల్ప వివాదం చెలరేగినా అక్కడితో సమసిపోయింది. కానీ, జడ్పీటీసీ సభ్యుడు రెడ్డీశ్వర్‌రెడ్డి శనివారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో బస్టాండు వద్దకు వచ్చి తమ కార్యకర్తలను ప్రశ్నించిన టీడీపీ శ్రేణులు ఎవరో బయటకు వస్తే సమాధానం చెప్తానని వెల్లడించారు.

దీంతో కాసేపటికి అక్కడికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకోగా.. మళ్ళీ ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. వైసీపీ శ్రేణులు రాళ్లు, బీరు సీసాలతో టీడీపీ వర్గీయులపై దాడులకు దిగగా.. వారికి ధీటుగా టీడీపీ కార్యకర్తలు కూడా రాళ్ల దాడికి దిగారు. అలా అరంగటపాటు సాగిన రాళ్లదాడిలో ఇరు వర్గాలకు చెందిన నేతలకు గాయాలవగా.. పోలీసులు రంగప్రవేశం చేసి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో చిత్తూరు నుంచి అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపు చేశారు. ఈ దాడితో అక్కడున్న వారు భయభ్రాంతులకు గురవగా.. ఇప్పుడు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ వాతావరణం నెలకొంది.