YSRCP: ప్రజల సాక్షిగా కొట్టుకున్న వైసీపీ కౌన్సిలర్లు

Kaburulu

Kaburulu Desk

January 13, 2023 | 08:01 PM

YSRCP: ప్రజల సాక్షిగా కొట్టుకున్న వైసీపీ కౌన్సిలర్లు

YSRCP: ఒకవైపు ఏపీలో రాజకీయం రసకందాయంగా సాగుతుంది. వచ్చే ఎన్నికలలో ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుంటారు? అధికార పార్టీ వైసీపీ మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోగలదా? అనే రాజకీయ చర్చలు జరుగుతుండగానే.. అధికార పార్టీలో కొందరు అసమ్మతి నేతలు ఇప్పుడిప్పుడే మీడియాకి ఎక్కుతున్నారు. వీళ్ళు చాలదన్నట్లు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అధికార పార్టీకి తలపోటుగా మారింది. అది కూడా చాలదనుకున్నారో ఏమో కౌన్సిలర్లే ప్రజల ముందే నడివీధిలో కొట్లాటకు దిగారు.

సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ కౌన్సిలర్లు నడిరోడ్డుపైనే తన్నుకున్నారు. ఇంటి నిర్మాణం విషయంలో ఏర్పడిన విభేదాలతో కుమ్ములాటకు దిగారు. హిందూపురం పట్టణంలోని ముక్కడిపేట ఐదవ వార్డులో వైసీపీ కౌన్సిలర్ ఇర్షద్ ఇంటిని నిర్మిస్తున్నారు. అయితే కౌన్సిలర్ ఇర్షద్ మూడు అడుగుల మేర రోడ్డును ఆక్రమించి ఇల్లు నిర్మిస్తున్నాడని మరో వైసీపీ కౌన్సిలర్ రోషణ్ అలీ మున్సిపల్ అధికారులకు, ఛైర్పర్సన్ ఇంద్రజకు ఫిర్యాదు చేశారు. ఇర్షద్ అసమ్మతి వర్గంలో కౌన్సిలర్ కావడంతో మున్సిపల్ ఛైర్పర్సన్ నిర్మాణాన్ని కూల్చేయడానికి జేసీబీ పంపించారు.

అయితే.. నిర్మాణాన్ని కూల్చేందుకు వచ్చిన జేసీబీని, అధికారులను ఇర్షద్ అడ్డుకున్నారు. రోషణ్ అలీ రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేస్తే లేని అభ్యంతరం తనకెందుకు వస్తుందని.. కాలనీలో అన్ని ఇళ్లు ఎక్కడి వరకు ఉన్నాయో.. తానూ అక్కడి వరకు నిర్మించుకుంటున్నానని అధికారులకు తెలిపారు. అయితే.. తానెక్కడ ఆక్రమించుకున్నానో చెప్పాలని రోషణ్ అలీ ఇర్షద్ నిలదీయడంతో ఘర్షణ మొదలైంది. అది కాస్త శృతిమించి నడిరోడ్డుపైనే ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో గొడవ సద్దుమణిగింది.

ఘర్షణ అనంతరం ఇర్షద్ వర్గం 10 మంది కౌన్సి లర్లు ఛైర్పర్సన్ ఛాంబర్ కు వెళ్లి సొంత పార్టీ కౌన్సిలర్ ఇంటి నిర్మాణాన్ని కూల్చడానికి జేసీబీ పంపడం తగదని వాదించారు. ఇదే సమయంలో ఛైర్పర్సన్ కు.. కౌన్సిలర్ శివకుమార్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. తనను శివకుమార్ దూషించారంటూ ఛైర్పర్సన్.. వన్ టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రౌడీలతో చైర్పర్సన్ భర్త తమపై దాడికి ప్రయత్నించారని ఇర్షద్ వర్గం మరో ఎదురు కేసు పెట్టారు. దీంతో ఏం చేయాలో అర్ధం కాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.