Yadadri Temple: నేటి నుంచి యాదాద్రి వార్షికోత్సవాలు.. ఆలయ పునఃప్రారంభం తర్వాత తొలిసారి

Yadadri Temple: తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి పొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. నేటి నుండి మార్చి 3వ తేదీ వరకు అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దీంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. తెల్లవారుజాము నుంచే లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి క్యూ కట్టారు. యాదాద్రి ప్రధానాలయం ఉద్ఘాటన జరిగిన తర్వాత మొదటిసారిగా లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.
విష్వక్సేన ఆరాధనతో ప్రారంభంకానున్న బ్రహ్మోత్సవాలు మార్చి 3వ తేదీ వరకు జరగనున్నాయి. మంగళవారం ఉదయం విష్వక్సేనారాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నా రు. 27న ఎదుర్కోలు, 28న సాయంత్రం తిరు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. స్వామివారి కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులతోపాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
యాదాద్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలు, సుదర్శన నరసింహ హోమం , నిత్య కళ్యాణాలను తాత్కాలికంగా రద్దు చేశారు అధికారులు. వార్షిక బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని నేటి నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు మొక్కు సేవలను రద్దు చేస్తున్నామనని యాదగిరిగుట్ట దేవస్థానం ఈఓ గీత ప్రకటించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. పూలతో సుందరంగా తీర్చిదిద్దారు.
రేపు దేవతాహ్వానం పలకనుండగా.. పదుల సంఖ్యలో రుత్విక్కులకు ఆహ్వానాలు పంపారు. ఇప్పటికే ఆలయంలో హోమగుండం సిద్ధం చేయగా.. భారీగా తరలిరానున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చలువపందిళ్ళు వేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 11 రోజులపాటు సాగే ఈ బ్రహ్మోత్సవాలను పాంచరాత్రాగమ రీతిలో నిర్వహించాలని నిర్ణయించగా.. యాదగిరీశుడి ఉత్సవాలను గతం కంటే అద్భుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.1.50 కోట్లు కేటాయించగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.