Chiranjeevi: పక్క రాష్ట్రం రాజకీయాల గురించి నాకెందుకు?.. చిరు ఇంతమాట అనేశాడేంటి?

Kaburulu

Kaburulu Desk

January 12, 2023 | 08:40 AM

Chiranjeevi: పక్క రాష్ట్రం రాజకీయాల గురించి నాకెందుకు?.. చిరు ఇంతమాట అనేశాడేంటి?

Chiranjeevi: సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వాల్తేరు వీరయ్యగా రాబోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. బాబీ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. చిరంజీవి కూడా గతంలో ఎన్నడూ లేనంతగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పలు టీవీ షోలకు, ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతూ.. వాల్తేరు వీరయ్యకు మరింత హైప్ తెచ్చే పనిలో ఉన్నాడు.

కాగా, అలా ప్రమోషన్లలో ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణలో ఉంటున్నానని, తన ఓటు హక్కు కూడా ఇక్కడే ఉందని, పొరుగు రాష్ట్ర రాజకీయాల గురించి తనకెందుకని.. ఏపీ రాజకీయాలపై తన అభిప్రాయాన్ని చెప్పారు. అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోందో తనకు తెలియదని, తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా తనకు లేదని అన్నారు.

మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తనకు ఏపీ రాజకీయాలతో సంబంధం లేదని.. తాను వంద శాతం రాజకీయాల్లో లేనని ఇప్పటికే చాలా సార్లు చెప్పానని, తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని అన్నారు. తన ఇంటికి న్యూస్ పేపర్లు కూడా రావని.. అక్కడి రాజకీయాలపై ఎలాంటి ఆరాలు తీయనని మెగాస్టార్ చెప్పేశారు. ఇక తనకు విశాఖలో ఇల్లు ఉండాలని కోరుకున్న మాట నిజమేకానీ అయితే తన కోరికకు, ఏపీ రాజకీయాలకు సంబంధం లేదని అన్నారు.

ఏపీ రాజకీయాలపై చిరంజీవి మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సమన్యాయం పేరిట ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాష్ట్రం మొత్తాన్ని చుట్టేసి.. కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన మెగాస్టార్ ఇప్పుడు ఇలా అసలు తనకు ఏపీతో సంబంధమే లేదని.. తనసలు తెలంగాణ వాడినే అన్నట్లుగా చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే.. కేవలం రాజకీయాల గురించి మాత్రమే చిరంజీవి సంబంధం లేదన్నారు కానీ.. ఆయన ఏపీ రాష్ట్రంతో సంబంధం లేదనలేదు కదా అని ఆయన అభిమానులు వెనకేసుకొస్తున్నారు.