Mutyala Naidu: ఒకేసారి చేస్తామని ఎప్పుడు చెప్పాం?.. మద్య నిషేధంపై డిప్యూటీ సీఎం!

Kaburulu

Kaburulu Desk

January 20, 2023 | 08:51 PM

Mutyala Naidu: ఒకేసారి చేస్తామని ఎప్పుడు చెప్పాం?.. మద్య నిషేధంపై డిప్యూటీ సీఎం!

Mutyala Naidu: 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టి గ్రామ గ్రామాన.. ఊరూ వాడా తిరిగి మరీ చెప్పారు.. తాము అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తామని. అందుకు అనుగుణంగా అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే అడుగు ముందుకు పడింది. మొత్తం మద్యం షాపులను అండర్ టేక్ చేసుకున్న ప్రభుత్వం పొరుగున ఏ రాష్ట్రంలో లేనంతగా ఏపీలో మద్యం రేట్లు పెంచారు. దీంతో పొరుగు రాష్ట్రాల నుండి విపరీతంగా అక్రమ మద్యం సరఫరా అయింది.

మరోవైపు ధరలు పెంచినా ఏపీలో మద్యంపై ఆదాయం గణనీయంగా పడిపోయింది. దీంతో మళ్ళీ అన్ని రాష్ట్రాలతో సమానంగా మద్యం ధరలు తగ్గించారు. ఇక, ఏడాదికి కొన్ని చొప్పున షాపులను తగ్గిస్తామని చెప్పినా.. రెండేళ్లుగా అది కూడా కుదరడం లేదు. ఒకవైపు ప్రభుత్వం ఆర్ధిక కష్టాలలో ఉండడంతో మద్యంపై ఆదాయం ప్రభుత్వానికి తప్పని అవసరంగా మారింది. మరోవైపు మద్యంపై ఆదాయాన్ని కూడా తనఖా పెట్టి అప్పు తెచ్చారని ప్రతిపక్షాల విమర్శలు తెలిసిందే.

అయితే, ప్రతిసారి ఎక్కడో చోట మంత్రులు, ఎమ్మెల్యేలకు, ఇతర వైసీపీ పార్టీ ముఖ్య నేతలకు ఈ మద్య నిషేధంపై ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. దీంతో ఇప్పటికీ ఈ హామీకి కట్టుబడే ఉన్నామని చెప్తున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు కూడా మరోసారి అదే వ్యాఖ్యలు చేశారు. ఒకరకంగా మద్య నిషేధంపై బూడి ముత్యాల నాయుడు కొత్త భాష్యం చెప్పారు.

శుక్రవారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ముత్యాల నాయుడు.. వందశాతం ఒకేసారి మద్య నిషేధం చేస్తామని ఎప్పుడూ చెప్పలేదని, నిషేధం అంచెలంచెలుగా చేస్తామన్నారు. అంతేకాదు, కొత్తగా బార్లకు లైసెన్స్ ఇచ్చినంత మాత్రాన అవి పెరిగినట్టు కాదని, ప్రస్తుతం ఉన్న వాటిలోనే సర్దుకుని వెళ్తున్నామన్నారు. ఇక 2024లో ఏం చేస్తామో చూడండి.. ఆ విషయం ప్రజలకే చెబుతాం.. ప్రజలు మా వెంటే ఉన్నారని చెప్పుకొచ్చారు.