AP BJP: ఏం జరుగుతుంది? ఏపీ పార్టీపై బీజేపీ అధిష్టానం ఫోకస్?

Kaburulu

Kaburulu Desk

January 26, 2023 | 06:36 PM

AP BJP: ఏం జరుగుతుంది? ఏపీ పార్టీపై బీజేపీ అధిష్టానం ఫోకస్?

AP BJP: ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటన్నది పార్టీ అధిష్టానానికి సైతం అంతుబట్టడం లేదా అనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికీ తాము బీజేపీతో పొత్తులో ఉన్నామని చెప్తున్నారు. మరోవైపు టీడీపీతో మైత్రికి బాటలు వేశారు. అయితే, టీడీపీతో కలిసేందుకు సోము వీర్రాజు నాయకత్వంలోని రాష్ట్ర పార్టీ సుముఖంగా లేదు. ఇదే పార్టీలో మరో వర్గం సోము వీర్రాజు నిర్ణయాలపై గుర్రుగా ఉన్నారు. పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వర్గం చెప్పుకొనే వారు ఈ మధ్యనే మండల స్థాయి నేతలు, కార్యకర్తలు 200 మంది పార్టీని వీడుతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు.

ముందుంది ఎన్నికల కాలం.. అన్ని పార్టీలు గెలువు లెక్కలేసుకొని మరింతగా ప్రజలలోకి వెళ్లేందుకు చూస్తుంటే ఏపీ బీజేపీ మాత్రం నాలుగు విమర్శలు అధికార పార్టీకి.. నాలుగు విమర్శలు ప్రతిపక్షానికి ఇచ్చేసి పబ్బం గడుపుతున్నారు. ఒకవైపు దేశవ్యాప్తంగా బీజేపీ ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ పాగా వేయాలని చూస్తుంటే.. ఏపీలో మాత్రం ఎటూ తేలని రాజకీయంతో ఇంకా ప్రజలకు దూరమవుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధిష్టానం రాష్ట్ర పార్టీపై ఫోకస్ పెంచినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ శివ ప్రకాష్ ఫోన్ చేశారని చెబుతున్నారు. జనవరి 27న తనతో విజయవాడలో భేటీ కావాలని కూడా శివ ప్రకాష్.. కన్నా లక్ష్మీనారాయణకు సూచించినట్టు ప్రచారం జరుగుతుంది.

మరోవైపు అధ్యక్షుడు సోము వీర్రాజు ఎక్కడికి వెళ్లినా టీడీపీతో పొత్తుపైనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఒకవైపు పవన్ ఓపెన్ గా టీడీపీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లు ఇన్ డైరెక్ట్ వ్యాఖ్యలు చేస్తుంటే.. బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో రేపు శివ ప్రకాష్-కన్నాల సమావేశంలో ఏం చర్చించనున్నారన్నది ఆసక్తిగా మారింది.