Ramireddy Pratap Kumar Reddy: మేమేమీ సత్యవంతులం కాదు.. వైసీపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

Kaburulu

Kaburulu Desk

January 30, 2023 | 11:52 AM

Ramireddy Pratap Kumar Reddy: మేమేమీ సత్యవంతులం కాదు.. వైసీపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

Ramireddy Pratap Kumar Reddy: మేమేమీ సత్యవంతులం కాదు.. అవినీతి కూడా కొత్తేమీ కాదు.. అవినీతి జరగలేదని మేమేమీ మీకు చెప్పడం లేదు. ఈ ప్రభుత్వంలో కూడా అవినీతి జరిగింది కానీ.. గత ప్రభుత్వంలో ఇంతకి మించి ఎక్కువగానే జరిగింది. ఇదీ నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు. కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఓ సమావేశంలో, విలేకర్ల ముందే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అవినీతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కావలిలోని వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. అవినీతి కొత్తేమీ కాదని.. మేమేమీ సత్యవంతులమని చెప్పడం లేదని.. అయితే, ఇప్పటి కన్నా ఎక్కువగా గత టీడీపీ
ప్రభుత్వం హయాంలో అవినీతి జరిగిందని పేర్కొన్నారు. అప్పట్లో బీద రవిచంద్ర రూ.400 కోట్ల వరకూ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. తమ పాలనలో జరుగుతున్న గ్రావెల్
తవ్వకాలన్నీ పేదల ఇళ్ల అవసరాలకేనని పేర్కొన్నారు.

గతంలో ఇక్కడ టీడీపీ నేత బీద రవిచంద్ర, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు విచ్చలవిడిగా గ్రావెల్ దోపిడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో అక్కడక్కడా పురపాలక అధికారులపై విమర్శలు వస్తున్నాయని వ్యాఖ్యానించిన ఆయన.. ఇకపై అలాంటి ఆరోపణలకు తావులేకుండా చూస్తామని పేర్కొన్నారు. ఎక్కడైనా ఇళ్ల నిర్మాణాల ప్లాన్లకు పురపాలక అధికారులు మామూళ్లు డిమాండు చేస్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

రాజకీయ నేతలంటే అవినీతి సహజమని సమాజంలో పేరుంది. అందునా అధికారంలో ఉన్న నేతలంటే ఎన్నికలలో పెట్టిన ఖర్చుకు వడ్డీతో సహా వసూళ్లు చేసుకుంటారని చెప్పుకుంటారు. అయితే.. దీన్ని ఏ నేత బహిరంగంగా ఒప్పుకోరు. బయటకి తాము ప్రజాసేవ కోసమే రాజకీయాలలోకి వచ్చామని.. అవినీతికి ఆమడదూరమని చెప్పుకుంటారు. కానీ.. గతంలో ప్రకాశం జిల్లాకి చెందిన గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తామేమీ పెళ్ళాం మేడలో పుస్తెలతాడు అమ్మి ప్రజాసేవ చేస్తామని చెప్పలేదని.. నాలుగు రూపాయలు సంపాదించుకొనేందుకు వచ్చామని బహిరంగంగా చెప్పారు. ఇప్పుడు ఇలా కావలి ఎమ్మెల్యే అవినీతి జరిగిందని ఒప్పుకోవడం ఆసక్తిగా మారింది.