Viveka Murder Case: వివేకా హత్యకేసు.. నేడు సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్

Kaburulu

Kaburulu Desk

January 28, 2023 | 08:47 AM

Viveka Murder Case: వివేకా హత్యకేసు.. నేడు సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్

Viveka Murder Case: ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డికి స్వయానా బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా.. సోమవారం ఒకసారి సీబీఐ అధికారులు నోటీసులు అందించగా.. అవినాష్ నాలుగు రోజుల గడువు కోరారు. దీంతో సీబీఐ అధికారులు ఈరోజు హాజరు కావాలని మరోసారి నోటీసులు ఇచ్చారు.

వివేకా కేసు విచారణ మొదలైన తర్వాత ఎంపీ అవినాష్ తొలిసారి విచారణ ఎదుర్కొంటున్నారు. సీబీఐ అధికారులు ఎంపీని మొదటిసారి ప్రశ్నించబోతున్నారు. అవినాష్ రెడ్డికి అందించిన నోటీసుల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి అవినాష్ వెళ్లనున్నా రు. ఇందుకోసం ఒకరోజు ముందే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు.

వివేకా హత్య జరిగిప్పటి నుంచి విపక్షాలు.. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రిభాస్కర్ రెడ్డిపైనే విమర్శలు గుప్పిస్తున్నాయి. 2020 మార్చి 11న హైకోర్టు ఆదేశాలతో దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ.. ఇప్పుడు అవినాష్ ను విచారణ చేయనుంది. ఇక, వివేకా కేసు విషయానికి వస్తే.. 2019 మార్చి 15న పులివెందులలోని నివాసంలో వైఎస్ వివేకా హత్య జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ హత్య జరగడం అందరినీ షాక్ కి గురిచేయగా.. అప్పటి ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

ఆ తర్వాత ఈ కేసు ఏపీ హైకోర్టుకు.. అక్కడ నుండి సీబీఐకి వెళ్లాయి. ఈ కేసు విచారణ వేగవంతంగా లేదని వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. ఈ మధ్యనే కేసును సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేసింది. తెలంగాణకు బదిలీ అయిన తర్వాత విచారణ మొదలుపెట్టిన సీబీఐ ముందుగా ఎంపీ అవినాష్‌కు ఇప్పుడు నోటీసులిచ్చింది. ముందుగా అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కోసం ఆరా తీసి.. ఆ తర్వాత అవినాష్‌రెడ్డికి నోటీసులు ఇచ్చారు. దీంతో ఈ కేసుపై ఒక్కసారిగా ఉత్కంఠ మొదలైంది.