Fans War: వీరసింహారెడ్డి vs వాల్తేరు వీరయ్య.. డల్లాస్‌లో ఫ్యాన్స్ కుమ్ములాట!

Kaburulu

Kaburulu Desk

January 3, 2023 | 01:15 PM

Fans War: వీరసింహారెడ్డి vs వాల్తేరు వీరయ్య.. డల్లాస్‌లో ఫ్యాన్స్ కుమ్ములాట!

Fans War: స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అంటూ మన హీరోలేమో గీతాలు పాడుకుంటున్నారు. బావా బామ్మర్ది అంటూ వరుసలు పెట్టి పిలుచుకుంటూ ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటున్నారు. ఒకరి సినిమా వేడుకలకు మరొకరు అతిధులుగా వెళ్తున్నారు.. ఒకరి షోలకు మరొకరు వెళ్తూ రక్తి కట్టిస్తున్నారు. సినిమా అంతా ఒక్కటే.. మేమంతా ఎప్పుడూ ఒకరికోసం ఒకరం అండగా ఉంటామని చెప్తూ మద్దతు ప్రకటించుకుంటున్నారు.

కానీ, అభిమానులేమో ఈ హీరోల కోసం చొక్కాలు చింపి బ్యానర్లు కడతారు.. వాళ్ళ పుట్టినరోజులకి పండగలు చేస్తారు. అంతటితో ఆగితే పర్లేదు.. అంతకు మించి మా హీరోనే తోపు.. మా హీరోనే తురుము అంటూ జబ్బలు చరుచుకుంటున్నారు. అంతేనా.. మీ హీరో దండగ.. మీ హీరో వెధవ అంటూ సోషల్ మీడియా వేదికగా బూతు పురాణాలను అందుకుంటున్నారు. ఒకరి సినిమా వస్తుందంటే మరో హీరో అభిమానులు పనిగట్టుకొని మరీ నెగటివ్ ప్రచారం చూస్తున్నారు. చివరికి సినిమా కలెక్షన్ల విషయంలో కూడా రచ్చ రచ్చ చూస్తున్నారు.

ఒకప్పుడు బీ, సీ సెంటర్లలో సినిమా రిలీజ్ అవుతుందంటే ఈ సినిమా సందడి కనిపించేది. ఆ తర్వాత ఇది మెట్రో నగరాలలో మల్టీఫ్లెక్స్ థియేటర్ల వరకు చేరింది. తర్వాత తర్వాత కాలంలో ఇది ఓవర్సీస్ వరకు వెళ్ళింది. ఇప్పుడు మన తెలుగు సినిమా వస్తుందంటే అమెరికా, యూకే లాంటి దేశాలలో కూడా సందడి కనిపిస్తుంది. ర్యాలీలు పెట్టి మరీ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి దేశం కాని దేశంలో కూడా హీరోల కోసం అభిమానులు కొట్లాటకు దిగుతున్నారు.

అమెరికాలోని డల్లాస్‌లో బాలయ్య, చిరంజీవి అభిమానులు కొట్లాటకు దిగారు. ముందు జై జై నినాదాలతో మొదలైన రచ్చ కాస్త చివరికి బాహాబాహీకి వరకు వెళ్ళింది. తొలుత జై బాలయ్య, జై చిరంజీవా అంటూ నినాదాలతో మొదలై ఆ తర్వాత ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నా రు. అంతటితో ఆగకుండా సంక్రాంతికి రాబోతున్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలలో మాదే విజయం అంటే మాదే విజయం అని గోల మొదలు పెట్టారు.

ఆ తర్వాత ఇది రాజకీయాల వరకు వెళ్లి టీడీపీ మద్దతు లేనిదే పవన్ రాజకీయాల్లోకి రాణించలేక మళ్ళీ టీడీపీ పంచన చేరుతున్నాడని.. జనసేన లేకపోతే చంద్రబాబు మళ్ళీ ఓడిపోతాడనే చేర్చుకుంటున్నారని గొడవ పడ్డారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెద్దదై బాహాబాహీకి దిగారు. చివరికి డల్లాస్ పోలీసులు రంగంలోకి దిగి కంట్రోల్ చేయాల్సి వచ్చింది. ఇక ఈ ఈ గొడవకి కారణమైన కేసీ చేకూరిని అరెస్ట్ చేశారు. మొత్తంగా ఇతర దేశాలలో కూడా తెలుగు వారి పరువుని సినిమా హీరోల సాక్షిగా మడతపెట్టేశారు.