Vallabhaneni Vamsi: వంశీకి ఎన్నికల గండం.. వ్యతిరేకంగా రెండు పార్టీల్లో భారీ స్కెచ్‌లు?

Kaburulu

Kaburulu Desk

January 16, 2023 | 10:41 AM

Vallabhaneni Vamsi: వంశీకి ఎన్నికల గండం.. వ్యతిరేకంగా రెండు పార్టీల్లో భారీ స్కెచ్‌లు?

Vallabhaneni Vamsi: ఏపీలో ఎన్నికలకు ఇంకా ఒకటిన్నర ఏడాది సమయం ఉంది. అయినా.. ఇక్కడ పార్టీలు ఇప్పటి నుండే గెలుపు అవకాశాలపై దృష్టి పెట్టారు. ఎవరికి వారు గెలుపు గుర్రాలు ఎవరనేదానిపై ఫోకస్ పెట్టి కార్యాచరణ మొదలు పెట్టారు. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ.. ఇప్పటి వరకు తమని తీవ్రంగా ఇబ్బంది పెట్టిన అధికార పార్టీ నేతలను ఓడించేందుకు ఎత్తులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. వీరిలో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీలో గెలిచి వైసీపీ పంచన చేరిన వాళ్ళు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

కృష్ణా జిల్లా కీలక నేతలలో వల్లభనేని వంశీ ఒకరు. గత ఎన్నికలలో టీడీపీ తరపున గెలిచిన వంశీ.. ఆ తర్వాత టీడీపీకి దూరమై వైసీపీకి జై కొట్టారు. అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ గా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పటికప్పుడు టీడీపీని ముప్పతిప్పలు పెట్టారు. తీవ్ర పదజాలంతో చంద్రబాబుతో పాటు లోకేష్ ను కూడా దుర్బాషలాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈసారి వంశీని ఎలాగైనా అసెంబ్లీకి వెళ్లకుండా చేయాలన్నది టీడీపీ ప్లాన్ గా కనిపిస్తుంది.

వైసీపీ అధినాయకత్వం నుండి వంశీకి టికెట్ ఖాయమని స్పష్టత ఉంది. దీంతో టీడీపీ గన్నవరంలో కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. వంశీ వ్యతిరేక వైసీపీ నేతలతోనే వంశీకి చెక్ పెట్టేలా వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తుంది. గన్నవరంలో వైసీపీ నేతలుగా ఉన్న యార్లగడ్డ వెంకటరావు, దుట్టా రామచంద్రరావు ఇద్దరూ వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా ఉన్నారు. వంశీ పార్టీకి దగ్గర అయిన సమయం నుంచి ఆ ఇద్దరు మద్దతు దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సాక్షాత్తు జగన్ మోహన్ రెడ్డే వచ్చి వీళ్ళని వంశీతో చేతులు కలిపి కలిసి పనిచేయాలని సూచించినా వీళ్ళు వంశీతో కలవడం లేదు. ఇవేమీ పట్టించుకోని వంశీ మాత్రం వైసీపీ అధినాయకత్వం తనకు మద్దుతుగా ఉందనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు. తాజాగా యార్లగడ్డ వెంకటరావు, దుట్టా రామచంద్రరావు భేటీ అయి వంశీకి వ్యతిరేకంగా అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే వెంకటరావు సొంతంగా పార్టీ కార్యాలయాన్ని కూడా మొదలు పెట్టనున్నారని ప్రచారం జరుగుతుంది.

మరోవైపు టీడీపీ నుంచి ప్రస్తుత విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ టీడీపీ అభ్యర్ధిగా గన్నవరం నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. అదే జరిగితే వంశీకి మరింత ఇబ్బందే. వంశీని వైసీపీలో వ్యతిరేకిస్తున్న వెంకటరావు, రామచంద్రరావులో ఒకరు ఇండిపెండెంట్ గా పోటీ చేయడం ఖాయమని కృష్ణా జిల్లా రాజకీయాలలో ప్రచారం జరుగుతుండగా.. ఇటు వైసీపీ నుండి.. అటు టీడీపీ నుండి రెండు వైపులా వంశీ టార్గెట్ గా రాజకీయాలు మొదలైనట్లేనని తెలుస్తుంది. మరి వంశీ దీన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.