Deccan Complex: అదుపులోకి రాని మంటలు.. భవనాన్ని కూల్చేందుకు సిద్దమవుతున్న అధికారులు

Kaburulu

Kaburulu Desk

January 20, 2023 | 08:50 AM

Deccan Complex: అదుపులోకి రాని మంటలు.. భవనాన్ని కూల్చేందుకు సిద్దమవుతున్న అధికారులు

Deccan Complex: డెక్కన్ మాల్‌లో మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. భవనం కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. భవనం దగ్గరికి అధికారులు ఎవరినీ అనుమతించడం లేదు. నేడు కాలిన భవనాన్ని జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించనున్నారు. భవనంలోని గోడౌన్‌కు పర్మిషన్ లేదని జీహెచ్ఎంసీ చెబుతోంది. సెల్లార్‌లో చిక్కుకున్న వారిపై ఇంకా స్పష్టత రాలేదు. పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

సికింద్రాబాద్‌ పరిధిలోని రాంగోపాల్‌పేట డెక్కన్‌ స్టోర్‌లో చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రావడం లేదు. రెండవ రోజు కావొస్తున్నా అగ్నికీలలు ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి. డెక్కన్‌ స్పోర్ట్స్‌ భవనంలో నిన్న ఉదయం 10.50 గంటల సమయంలో ప్రమాదం జరిగిన విషయం తెలిసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 40 ఫైర్ ఇంజిన్లు మోహరించినా మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్‌ కష్టంగా మారింది.

మొత్తం ఐదు అంతస్థుల బిల్డింగ్ మొత్తాన్ని గోడౌన్ కోసమే వాడుతుండడం.. బిల్డింగ్ సెల్లార్ సహా అన్ని ఫ్లోర్లలో రెగ్జిన్ మెటీరియల్, ఫ్యాబ్రిక్ ఉండటం మంటలు ఉవ్వెత్తున ఎగిసేందుకు కారణమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. 20 నిమిషాల పాటు అదే పనిగా వాటర్ పంప్ చేసినా మంటలు అదుపులోకి రావడం లేదని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు. రెసిడెన్షియల్ బిల్డింగ్ ను కమర్షియల్ కోసం వాడుతున్నారని, అనుమతులు లేకుండానే గోడౌన్ ఏర్పాటు చేశారని చెబుతున్నారు.

కాగా.. భారీగా మంటలు చెలరేగడంతో.. మంటల్లో కొందరు చిక్కుకున్నా రు. వారిలో ముగ్గురిని కాపాడారు. మరో వైపు భవనంలో మరో ముగ్గురు చిక్కుకున్నట్లు దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దక్కన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ భవనం అంతా పూర్తిగా దగ్ధమవగా మంటల వేడికి పిల్లర్లు పూర్తీగా దెబ్బతిన్నా యి. దీంతో పిల్లర్ల సపోర్ట్ తో ఉన్న ముందు భాగం భవనం ఏ క్షణంలో అయినా కూలిపోయే అవకాశం ఉంది. దీంతో భవనానికి చుట్టుపక్కల వాసులు బిక్కుబిక్కుమంటున్నారు.

అగ్నిప్రమాదం ఘటన బిల్డింగ్ దగ్గరకు మంత్రి తలసాని యాదవ్‌ రెండు సార్లు వెళ్లి పరీశీలించగా ఈరోజు ఉదయం భవనాన్ని కూల్చి వేయాలని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు సూచించారు. దీంతో భవనం చుట్టుపక్కల ఉన్న నివాసాలను ఖాళీ చేయించే పనిలో ఉన్నారు. ఇప్పటికే బిల్డింగ్ వెనకాల ఉన్న ఇండ్లలోని వ్యక్తులను ఖాళీ చేయించగా.. జేఎన్టీయూకు చెందిన నిపుణుల కమిటీ ఇవాళ ఈ భవనాన్ని పరిశీలించనుంది.