Visakha Ukku Praja Garjana: ఉక్కు గర్జన.. వైసీపీ, టీడీపీ, జనసేన, కమ్యూనిస్ట్ నేతల హాజరు?

Kaburulu

Kaburulu Desk

January 30, 2023 | 01:52 PM

Visakha Ukku Praja Garjana: ఉక్కు గర్జన.. వైసీపీ, టీడీపీ, జనసేన, కమ్యూనిస్ట్ నేతల హాజరు?

Visakha Ukku Praja Garjana: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో భాగంగా సోమవారం ఉక్కు నగరంలో ప్రజా గర్జన సభ నిర్వహిస్తున్నారు. కేంద్రం నవరత్నాల లాంటి ప్రభుత్వరంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టేందుకు, దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంలో భాగంగానే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేస్తుందని ఆరోపిస్తూ ఈ విశాఖ ఉక్కు గర్జన సాగనుంది.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ నిర్ణయం సమయం నుంచి వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు, విశాఖ ఉక్కు కార్మికులు, ఉద్యోగులు ఉక్కును ప్రైవేటు పరం కానివ్వమంటూ నినదిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. గత రెండేళ్లుగా పోరాటం చేస్తున్న విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఈరోజు భారీ కార్యక్రమం నిర్వహించనుంది. దీని కోసం పార్టీలన్నీ ఒక్కటవుతున్నట్లు తెలుస్తుంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ నగరంలోని త్రిష్ణ మైదానంలో ఉక్కు ప్రజా గర్జన పేరుతో భారీ సభను ఏర్పాటు చేశారు.

ఈ సభకు అన్ని పార్టీలకు చెందిన ముఖ్యమైన నేతలు హాజరుకానున్నట్లు కమిటీ సభ్యులు చెబుతున్నారు. వైసీపీ నుంచి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్ నాథ్ హాజరుకానుండగా.. టీడీపీ నుంచి ఎంపీ రామ్ మోహన్ నాయుడు, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ హాజరు కానున్నారు. కాంగ్రెస్ నుంచి పీ రాకేష్ రెడ్డి, సీపీఐ నుంచి కె.రామకృష్ణ, సీపీఎం నుంచి శ్రీనవాసరావు, సీపీఐ న్యూ డెమోక్రసీ నుంచి కె. వెంకటేశ్వర్లు రానున్నారు. వీరితో పాటు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి కొణతాల లక్ష్మీ నారాయణ కూడా హాజరు కానున్నట్లు తెలుస్తుంది. అన్ని పార్టీలు ఏకమయ్యే ఈ సభ ఇప్పుడు ఆసక్తిగా మారింది.