TS MLC Election: 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక.. ఆశావహుల కొత్త ఆశలు

Kaburulu

Kaburulu Desk

January 6, 2023 | 08:58 AM

TS MLC Election: 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక.. ఆశావహుల కొత్త ఆశలు

TS MLC Election: లెక్క ప్రకారం ఈ ఏడాది చివరన తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఏ పార్టీకి ఆ పార్టీ అన్ని ప్రయత్నాలు కూడా మొదలు పెట్టగా.. ఈసారి ఎన్నికలు హోరాహోరీగా ఉండనున్నట్లు అర్ధమవుతుంది. అయితే.. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అది కూడా ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక కావడంతో ఆశావహులు కూడా భారీగానే ఉన్నారు.

ఈ ఏడాది మే నెలాఖరు నాటికి ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. మార్చి 29 నాటికి ఎమ్మెల్యేల కోటా కింద మూడు ఎమ్మెల్సీ స్థానాలు, ఉపాధ్యాయుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానం ఒకటి ఖాళీ కానుండగా, గవర్నర్ కోటా కింద రెండు స్థానాలు ఖాళీ కానున్నాయి. మే చివరి నాటికి ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఖాళీ కానుంది. ఎమ్మెల్సీ కోటా కింద కె.నవీన్‌కుమార్‌, గంగాధర్‌ గౌడ్‌, ఎలిమినేటి కృష్ణా రెడ్డి.. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ కె. జనార్దన్‌రెడ్డి.. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలు ఫరూఖ్‌ హుస్సేన్‌, డి రాజేశ్వర్‌రావు.. స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ స్థానాలు ఖాళీ కానున్నాయి.

వీటిలో ఎమ్మెల్సీ కోటా, గవర్నర్ కోటా స్థానాలను బీఆర్ఎస్ తన బలంతో దక్కించుకోనుంది. ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది. ఇక హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ టీచర్స్‌ నియోజకవర్గం ఎన్ని కల్లో PRTU(ప్రైవేట్‌ రికగ్నైజ్డ్‌ టీచర్స్‌ యూనియన్‌) అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చే అవకాశం ఉండగా.. ప్రస్తుతం ఎంఐఎం ఎమ్మెల్సీ ఉన్న హైదరాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్ళీ ఎంఐఎంకు మద్దతిచ్చే అవకాశం ఉంది.

ఇందులో PRTU ఇప్పటికే తన అభ్యర్థిగా చెన్నకేశవరెడ్డిని ప్రకటించగా, ఎంఐఎం సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీని నిలబెట్టనుంది. ఇక, ఎమ్మెల్యేల కోటా, గవర్నర్‌ కోటా కింద బీఆర్ఎస్ కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించే అవకాశం ఉండగా.. ఇందులో సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌, మాజీ కౌన్సిల్‌ చైర్మన్‌ స్వామిగౌడ్‌, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్ష్మయ్య గౌడ్‌.. బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ తో పాటు.. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరి పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో అసెంబ్లీకి వెళ్ళేది ఎవరో చూడాలి.