BRS Party: ఒకేరోజు ముగ్గురు వేర్వేరు ప్రోగ్రామ్స్.. ఖమ్మం బీఆర్‌ఎస్‌లో ఏం జరుగుతుంది?

Kaburulu

Kaburulu Desk

January 2, 2023 | 04:17 PM

BRS Party: ఒకేరోజు ముగ్గురు వేర్వేరు ప్రోగ్రామ్స్.. ఖమ్మం బీఆర్‌ఎస్‌లో ఏం జరుగుతుంది?

BRS Party: ఒకవైపు గులాబీ దళపతి జాతీయ స్థాయిలో కారును పరిగెత్తించేందుకు సిద్ధమవుతుంటే.. ఇక్కడ లోకల్ లో తెలంగాణ తమ్ముళ్లు కొందరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఖమ్మం జిల్లా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. ఒకప్పుడు ఇక్కడ టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పాగా వేస్తే.. ఇప్పుడు ఆ రెండు పార్టీల స్థానాలను బీఆర్ఎస్ ఆక్రమించేసింది. ఆ రెండు పార్టీల క్యాడర్ నే కాదు నాయకులను కూడా బీఆర్ఎస్ అక్కున చేర్చేసుకుంది. అదే ఇప్పుడు బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది.

రాజకీయ పార్టీలకు సహజంగా నూతన సంవత్సర వేడుకలను నిర్వహించడం ఆనవాయితీ. అందునా వచ్చేది ఎన్నికల సీజన్ కనుక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఈ ఏడాది ఏ జిల్లాకు ఆ జిల్లా నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించింది. అయితే.. ఖమ్మంలో మాత్రం ముగ్గురు నేతలు పోటాపోటీగా వేర్వేరుగా ఈ వేడుకలను నిర్వహించారు. ఆ ముగ్గురు ప్రస్తుతం రవాణా శాఖామంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్, టీడీపీలో ఓ వెలుగు వెలిగి ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుండి వైసీపీకి అక్కడ నుండి ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

ఈ ముగ్గురూ నూతన సంవత్సర వేడుకలను ఎవరికి వారు ఘనంగా నిర్వహించారు. అన్నదానాలతో పాటు ఎవరికి వారు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగాలు కూడా వినిపించారు. మంత్రి పువ్వాడ సరిగ్గా నూతన సంవత్సరం రోజున వాడవాడకూ పువ్వాడ అని ఓ కార్యక్రమాన్ని మొదలు పెట్టి 17, 27 డివిజన్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలను హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు తరలిరాగా.. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ చెప్పిన సమస్యల పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఇక, మాజీ మంత్రి తుమ్మల అనుచరులు బారుగూడెం శ్రీసిటీలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి హాజరై అనుచరులతో కలిసి సందడి చేశారు. ఈ కార్యక్రమానికి తుమ్మల అభిమానులు, ఉమ్మడి జిల్లా నుంచి పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మళ్లీ పాలేరు నుంచి బరిలో నిలవాలని కార్యకర్తలు కోరగా తప్పకుండా మీ ముందుకు వస్తానంటూ సముదాయించారు. ‘40 ఏళ్ల రాజకీయం .. అభివృద్ధి ప్రస్థానం.. ఖమ్మం ప్రగతి కిరణం తుమ్మల నాగేశ్వరరావు’ పేరిట ప్రగతి నివేదిక విడుదల చేశారు. ఇక్కడే భారీ విందు కూడా ఏర్పాటు చేశారు.

ఇక మాజీ ఎంపీ పొంగులేటి కూడా తన నివాసంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఇక్కడ భారీ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి అభిమానులు తమ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిపోయిందని వాపోయారు. దీంతో పొంగులేటి ఇది రాజకీయాలను వేదిక కాదని వాళ్ళని సముదాయిస్తూనే అర్హత కలిగిన అందరికీ రానున్న రోజులలో పోటీ చేసే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. మొత్తంగా ఇలా ఒకే పార్టీలో ఒకే జిల్లాలో ఉన్న ముగ్గురు నేతలు ఇలా ఎవరికి వారు ప్రోగ్రామ్స్ నిర్వహించడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.