Mekapati Chandrasekhar Reddy: ఈ ఎమ్మెల్యేనే నా తండ్రి.. డీఎన్ఏ పరీక్షకు కూడా సిద్ధం!

Mekapati Chandrasekhar Reddy: నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి పెద్ద చిక్కే వచ్చి పడింది. తనను కొడుకుగా ఒప్పుకోవాలంటూ చంద్రశేఖర్ రెడ్డికి మేకపాటి శివచరణ్ రెడ్డి అనే యువకుడు రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది. లేఖతో పాటు పాత ఫొటోలు కూడా శివచరణ్ రెడ్డి సోషల్ మీడియాలో విడుదల చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. తమను 18 ఏళ్ల పాటు రహస్యంగా ఉంచి వదిలిపెట్టావని లేఖలో శివచరణ్ రెడ్డి ఆరోపించారు.
కాగా, ఈ లేఖపై స్పందించిన చంద్రశేఖర్ రెడ్డి అసలు తనకు కుమారుడే లేడని తనకు ఇద్దరు కూతుళ్లు మాత్రమే ఉన్నారని చెప్పారు. తన మొదటి భార్య తులసమ్మకు రచనారెడ్డి, రెండో భార్య శాంతకుమారికి సాయి ప్రేమితారెడ్డి ఉన్నారని.. వీళ్లే తన కూతుళ్లు, వారసులు అని వెల్లడించారు. కేవలం డబ్బు కోసమే తల్లీ, కొడుకులు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. రాజకీయంగా అయితే నేరుగా తనను ఎదుర్కోవాలని ఇలా బ్లాక్ మెయిల్ ఎందుకని శివచరణ్ రెడ్డికి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన శివచరణ్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. నీకు కొడుకు లేకపోతే మరి నేను ఎవరిని? అని ప్రశ్నించిన శివచరణ్ రెడ్డి.. తాను డీఎన్ఏ పరీక్షలకు కూడా సిద్ధమేనని సవాల్ విసిరారు. తన తల్లికి చిన్నతనంలోనే మేనమామ కొండారెడ్డితో వివాహం కాగా విభేదాలతో విడిపోయారని.. అప్పటి నుండి చంద్రశేఖర్ రెడ్డి సంబంధం పెట్టుకున్నాడని.. ఐదేళ్ల తర్వాత తాను జన్మించానని.. నా సర్టిఫికెట్స్, ప్రూఫ్స్ అన్నిటిలో తండ్రిగా చంద్రశేఖర్ రెడ్డి పేరే ఉందని చెప్పుకొచ్చాడు.
డబ్బుల కోసమే తల్లి కొడుకులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలపై కూడా స్పందించిన శివచరణ్ రెడ్డి.. డబ్బు కోసం అయితే ఎప్పుడో బయటకి వచ్చేవాడినని.. నాకు డబ్బు, వారసత్వం అవసరం లేదని.. కేవలం గుర్తింపు మాత్రమే కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు ఏపీలో కూడా రాజకీయ వర్గాలలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతుంది. నెల్లూరులో అటు ఆనం వ్యవహారం.. ఇటు ఇలా మేకపాటి వ్యవహారంతో ఇక్కడ వైసీపీకి కూడా పెద్ద చిక్కే వచ్చి పడింది.