Telangana Secretariat: తెలంగాణ నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవ తేదీ ఇదే!

Kaburulu

Kaburulu Desk

January 15, 2023 | 06:00 PM

Telangana Secretariat: తెలంగాణ నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవ తేదీ ఇదే!

Telangana Secretariat: నూతన సచివాలయ భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 20 ఎకరాల విస్తీర్ణంలో రూ. 617 కోట్లతో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ తో అధునాతనంగా ఈ భవన నిర్మాణం చేపట్టారు. లోపలికి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్ చేశారు. ఎనిమిది అంతస్తులతో కూడిన భవనంలో ఆరో అంతస్తులో సీఎం సచివాలయం సిద్ధం చేశారు. ఇప్పటికే నిర్మాణం ముగింపు దశకు చేరుకున్న కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది.

ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ సచివాలయాన్ని ప్రారంభిస్తారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ఫిబ్రవరి 17న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున సచివాలయాన్ని సీఎం ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. నూతనంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయానికి డా.బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంగా పేరు పెట్టిన విషయం తెలిసిందే. కొత్త సచివాలయాన్ని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే.

నూతన సచివాలయంలోని 6వ అంతస్తులో సీఎం బ్లాకును నిర్మించారు. ప్రారంభించిన రోజునే తన ఛాంబర్లో కేసీఆర్ బాధ్యతలను స్వీకరిస్తారని తెలుస్తోంది. అదే రోజు నుంచి నూతన సచివాలయం నుంచే ప్రభుత్వ కార్యకలాపాలను కొనసాగించనుంది. సచివాలయం నిర్మాణ పనుల్ని ముహుర్తానికి ముందుగానే పూర్తి చేయాలని షాపూర్‌ జీ పల్లోంజీ నిర్మాణ సంస్థతో పాటు ఆర్‌ అండ్ బీ అధికారుల్ని ఇప్పటికే ఆదేశించడం జరిగింది. నూతన సెక్రటేరియట్‌ ప్రారంభోత్సవానికి కొద్ది రోజులు మాత్రమే గడువు ఉండటంతో మిగిలిన సచివాలయ నిర్మాణ పనుల్ని పరుగులు పెట్టిస్తున్నారు.

నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి తగిన ఏర్పాట్లు, ముహుర్తాన్ని నిర్ణయించడంతో ఇంటీరియర్ పనులతో పాటు సచివాలయం ప్రాంగణంలో గార్డెనింగ్ పనులు మొదలైనట్లు తెలుస్తుంది. నిజానికి ఈనెల 23న సచివాలయాన్ని ప్రారంభిస్తారని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. అయితే పనులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే నెలకి వాయిదా పడింది. కాగా అప్పటికీ పనులు పూర్తి కాకపొతే 6వ అంతస్థులోని సీఎం బ్లాక్ ను మొదట ప్రారంభించి ఆ రోజు నుంచే సీఎం ఛాంబర్ నుంచి పాలన కొనసాగిస్తారని టాక్ వినిపిస్తుంది.