YSRCP MLA Anam: నన్ను అంతం చేయాలనే కుట్ర జరుగుతుంది.. ఎమ్మెల్యే ఆనం సంచలన వ్యాఖ్యలు!

Kaburulu

Kaburulu Desk

January 31, 2023 | 07:03 PM

YSRCP MLA Anam: నన్ను అంతం చేయాలనే కుట్ర జరుగుతుంది.. ఎమ్మెల్యే ఆనం సంచలన వ్యాఖ్యలు!

YSRCP MLA Anam: నమ్ము అంతం చేయాలనే కుట్ర జరుగుతుందని వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణ హాని ఉందని.. నన్ను ఈ భూమి మీద లేకుండా చేయాలని కొందరు ప్లాన్ చేస్తున్నారని ఆనం చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. వైసీపీ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, నెల్లూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న ఆనం రాంనారాయణ రెడ్డి కొద్ది రోజులుగా వైసీపీ అధిష్టానంపై కీలక వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆనం హాజరయ్యే బహిరంగ సభలపైనే సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు వైసీపీ పార్టీపై విమర్శలు చేశారు. దీంతో ఈ మధ్యనే ఆయనపై అధిష్టానం వేటు వేసింది. ఆయనను వెంకటగిరి నియోజకవర్గ వైకాపా ఇంచార్జి బాధ్యతల నుంచి తొలగించి వెంకటగిరి ఇంచార్జిగా ఆయన స్థానంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డిని ప్రకటించారు. అప్పటి నుండి ఆనం బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు.. మాట్లాడలేదు.

అయితే, మళ్ళీ ఆనం మార్క్ కామెంట్స్ మొదలు పెట్టారు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆనం.. నా సెక్యూరిటీ తగ్గించారు.. 2 ఏళ్ల నుంచి నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. నా రెండు ఫోన్లు ట్యాప్ చేశారు.. నా పీఏ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. నేను యాప్ లతో ఫోన్ మాట్లాడాల్సి వస్తుంది. ఈ వేధింపులు.. సాధింపులు కొత్తేమి కాదు.. నన్ను ఈ భూమి మీద లేకుండా చేయాలని చూస్తున్నారని హీట్ పెంచేలా మాట్లాడారు.

అంతేకాదు, నాకు ఎలాంటి నేర చరిత్ర లేదు. హత్యా రాజకీయాలు చేయలేదు. నేను సీబీఐ కేసుల్లో హైదరాబాద్ చుట్టూ తిరగడం లేదని ఆనం రామనారాయణ రెడ్డి సీఎం జగన్ పై పరోక్షంగా వ్యాఖ్యానించారు. అయితే మా ఎమ్మెల్యేల ఫోన్లు మేమే ఎందుకు ట్యాప్ చేస్తామని మాజీ మంత్రి, నెల్లూరు కోర్డినేటర్ బాలినేని ప్రశ్నించారు. మనసులో ఏదో పెట్టుకొని ఇలా చేయడం కరెక్ట్ కాదని ఆరోపించారు. మొత్తంగా ఆనం వ్యాఖ్యలు ఇప్పుడు నెల్లూరు రాజకీయాలలో సంచలనంగా మారాయి.