Janasena Party: కాపు-బీసీ కాంబినేషన్ కలిస్తే ఎవరినీ దేహీ అనాల్సిన పనిలేదు.. పవన్ సంచలన వ్యాఖ్యలు!

Kaburulu

Kaburulu Desk

March 11, 2023 | 10:40 PM

Janasena Party: కాపు-బీసీ కాంబినేషన్ కలిస్తే ఎవరినీ దేహీ అనాల్సిన పనిలేదు.. పవన్ సంచలన వ్యాఖ్యలు!

Janasena Party: కాపు, బీసీ కులాల కాంబినేషన్ కలిస్తే మనం ఎవరినీ దేహీ అని అడగాల్సిన అవసరం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మంగళగిరిలో జనసేన పార్టీ బీసీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. కాపు-బీసీ కాంబినేషన్ కలిసి ఉండాలని పవన్ క్యాడర్ ను కోరారు. ఈ కాంబినేషన్ ఉంటే ఎవరినీ దేహీ అని అడగాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ ఇద్దరు కలిస్తే రాజ్యాధికారం సాధ్యమన్నారు.

తాను కాపు నాయకుడిని కాదని.. నేను క్యాస్ట్ ఫీలింగ్ తో పెరగలేదు మానవత్వంతో పెరిగానని పవన్ తెలిపారు. కాపు రిజర్వేషన్లపై కొందరు బీసీ నేతలు తమ అభిప్రాయాన్ని చెప్పారని.. ఇదే విషయాన్ని రేపు కాపు ప్రతినిధులతో జరిపే సమావేశంలో చర్చిస్తానని చెప్పారు. బీసీలకు సంబంధించి అందరి అభిప్రాయాలు తీసుకున్నామన్న పవన్.. బీసీలు ముందుగా సాధించాల్సింది ఐక్యతని సూచించారు. పూలేను గౌరవించింది మనమేననే విషయాన్ని గుర్తుచేశారు.

రోజుకు అర్ధ రూపాయి తీసుకుని ఓటు అమ్ముకునే దుస్థితి పోతే పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన పవన్.. నేను అన్ని కులాలను సమానంగా గౌరవిస్తానని.. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరి చేసే ప్రయత్నం చేశానని చెప్పారు. కోనసీమలో కాపులు, శెట్టిబలిజ కులాలను కలిపే ప్రయత్నం చేశానని.. బలమైన కులాలు ఎందుకు కొట్టుకోవాలని.. కోనసీమలో ఇప్పుడు బలమైన మార్పు చూస్తున్నామన్నారు.

నన్ను కాపు ప్రతినిధిగా చూడనవసరం లేదని కోరిన పవన్.. గోదావరి జిల్లాల్లో నాకు ఎక్కువగా బీసీ ఓట్లే పడ్డాయని.. మత్స్యకారులు చాలామంది ఓట్లేశారని చెప్పారు. బీసీ సదస్సు అంటే ఇంతమంది వచ్చారు కానీ బీసీ నేతను నిలబెడితే ఎందుకు ఓట్లేయరని ప్రశ్నించారు. ఆర్థిక పరిపుష్టి వస్తే.. రాజ్యాధికారం కచ్చితంగా అదే వస్తుందని.. వైసీపీ, టీడీపీలకు ఆర్థిక పరిపుష్టే బలమని పవన్ కల్యాణ్ అన్నారు.