YSRCP: ఇయర్ మారింది.. జగన్ ప్రక్షాళన మొదలైంది?

Kaburulu

Kaburulu Desk

January 4, 2023 | 09:06 AM

YSRCP: ఇయర్ మారింది.. జగన్ ప్రక్షాళన మొదలైంది?

YSRCP: ఏడాది మారింది.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. అందుకే రాజకీయ పార్టీలు కొన్ని నిర్ణయాలతో దూకుడు పెంచారు. ఇన్నాళ్లు చూద్దాం.. చేద్దాం అన్నట్లే ఉన్నా.. ఇక ఇప్పుడు కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలో జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ప్రక్షాళన మొదలు పెట్టినట్లు కనిపిస్తుంది. ఎక్కడిక్కడ అస్ఫతృప్తి వెళ్లగక్కే నేతలను కట్టడి చేసే పని మొదలు పెట్టినట్లుగా కనిపిస్తుంది.

మంగళవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలకు దిగిన ఆనంకు చెక్ పెట్టారు. వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జిగా ఆనం స్థానంలో నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డిని సీఎం జగన్ నియమించారు. ఇక అదలా ఉండగానే బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం పైనా సీఎం జగన్ దృష్టి పెట్టారు. ఇక్కడ నుండి ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం మధ్య విభేదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇరువురి మధ్య సర్దుబాటుకు కూడా ప్రయత్నా లు మొదలుపెట్టారు.

ఇందులో భాగంగా పర్చూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఆమంచి కృష్ణమోహన్‌ను నియమిస్తారని వార్తలు వచ్చాయి. అయితే, పర్చూరు వెళ్లేందుకు ఆమంచి నిరాసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా చీరాలలో నేతల మధ్య విభేదాలకు సీఎం జగన్ చెక్ పెట్టేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. నెల్లూరు, బాపట్ల జిల్లాలలోనే కాదు.. కర్నూలు జిల్లా పార్టీలో నెలకొన్న పరిస్థితులపై సీఎం జగన్ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.

కర్నూలు నుండి ఎమ్మెల్యే హఫీస్ ఖాన్, ఎస్వీ మోహన్ రెడ్డి, జె సుధాకర్, హర్షవర్ధన్ రెడ్డి వర్గాల మధ్య విబేధాలున్న సంగతి తెలిసిందే. దీనిపై ఫోకస్ పెట్టిన సీఎం జగన్ ఆయా నేతలను పిలిచి మాట్లాడారు. దీంతో ఇక్కడ కొంతమేర వాతావరణం సద్దుమణిగింది. ఈ మూడు జిల్లాలలోనే కాదు.. ఎక్కడ ఇలాంటి అస్ఫతృప్తి వాతావరణం ఉన్నా చెక్ పెట్టేందుకు సిద్దమైన పార్టీ అధిష్టానం.. జిల్లాల వారీగా క్లాస్ పీకేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.