AP Capital: ఏపీకి మూడు రాజధానులపై నేడు సుప్రీం కోర్టులో విచారణ.. అసలేం జరుగుతుంది?

Kaburulu

Kaburulu Desk

January 31, 2023 | 08:22 AM

AP Capital: ఏపీకి మూడు రాజధానులపై నేడు సుప్రీం కోర్టులో విచారణ.. అసలేం జరుగుతుంది?

AP Capital: ఇప్పటికే ఏపీకి మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మూడు రాజధానులపై నేడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం ఆరు నెల్లలో అమరావతిని అభివృద్ది చేయాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో 2022 సెప్టెంబర్ 17వ తేదీన ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చి న తీర్పుపై స్టే ఇవ్వాలని ఆ పిటిషన్‌లో ప్రభుత్వం కోరింది. ఈ పిటిషన్‌పై విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు గత ఏడాది నవంబర్ 23న కొన్ని అంశాలపై స్టే ఇచ్చింది. కాలపరిమితితో రాజధానిని పూర్తి చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై, అమరావతి రాజధాని ప్రాంతంలో ప్లాట్లను అభివృద్ది చేసి మూడు నెలల్లోపుగా భూ యజమానులకు ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా స్టే విధించింది.

కానీ, అమరావతి రాజధానిపై మాత్రం స్టే ఇవ్వలేదు. మరోవైపు ఇదే అంశంలో అమరావతి రైతులు కూడా సుప్రీంలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు కలిపి విచారించే అవకాశం ఉండగా నేడు ఆ విచారణ జరగనుంది. మరోవైపు, ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ అనే వ్యక్తి గతంలో ఏపీ రాజధానిపై నియమించిన శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు అమలు చేయాలంటూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశారు.

మస్తాన్ వలీ పిటీషన్ ను కూడా అమరావతి రాజధాని కేసుతో కలిపి విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఏపీ రాజధాని అంశంలో నేడు సుప్రీంలో సుదీర్ఘ విచారణ ఖాయంగా కనిపిస్తుంది. ఒకవైపు ఏపీ ప్రభుత్వం పరిపాలన రాజధానిని విశాఖకి తరలించాలనే సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో నేడు సుప్రీం తీర్పు ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది.