Telangana News: పోస్టుమార్టం వద్దని డెడ్ బాడీ ఎత్తుకొని పరుగులు.. వెంబడించిన పోలీసులు

Kaburulu

Kaburulu Desk

January 14, 2023 | 09:00 AM

Telangana News: పోస్టుమార్టం వద్దని డెడ్ బాడీ ఎత్తుకొని పరుగులు.. వెంబడించిన పోలీసులు

Telangana News: పల్లెల్లో ఇప్పటికే పోస్ట్ మార్టంపై అనేక అనుమానాలున్నాయి. మృతిపై అనుమానులుంటే తప్ప మిగతా సందర్భాలలో పోస్టుమార్టం చేసేందుకు మృతుడి కుటుంబ సభ్యులు సుముఖంగా ఉండరు. చనిపోయాక కూడా మృతదేహాన్ని కోసి, కుట్లు వేయడం.. అవయవాలను కత్తిరిస్తారని ఎన్నో అపోహలు ఉండడంతో పోస్టుమార్టం చేసేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా అలాంటి ఘటనే ఒకటి జరిగింది.

ఓ వ్యక్తి మృతి చెందాడన్న సమాచారంతో పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహానికి శవపరీక్ష నిర్వహించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. దానికి మృతుడి బంధువు అభ్యంతరం తెలుపుతూ మృతదేహంతో పరుగులు తీశాడు. పోలీసులు ఆయన్ను వెంబడించి పట్టుకొని నచ్చజెప్పి మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ లో జరిగింది.

లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన జడల మల్లయ్య (65) అనే వ్యక్తి శుక్రవారం తెల్లవారుజామున తన ఇంట్లో మృతి చెందగా.. కుటుంబ సభ్యులు కూడా ఉదయం అంత్యక్రియలు చేయడానికి సిద్ధమయ్యారు. అయితే.. గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష కోసం సిరిసిల్లకు తరలించాలని సూచించారు. అందుకు మల్లయ్య కుటుంబ సభ్యులు ససేమీరా నిరాకరించారు.

పోలీసులు కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తుండగానే మల్లయ్య సోదరుడి కుమారుడు రాజు మృతదేహాన్ని భుజంపై వేసుకుని పరుగులు తీశాడు. మల్లయ్య గుండెపోటుతో మాత్రమే మరణించాడని, ఆయన మృతిపై తమకు ఎటువంటి అనుమానం లేదని.. పోస్టుమార్టం తమకి అవసరం లేదని శ్మశానవాటిక వైపు పరుగులు తీశాడు. దీంతో పోలీసులు అతడిని వెంబడించి అడ్డుకున్నాడు.

చివరగా మృతుని భార్యకు నచ్చజెప్పిన పోలీసులు మృతదేహాన్ని సిరిసిల్లకు తరలించి శవపరీక్ష నిర్వహించారు. మల్లయ్య మరణాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు హెడ్కానిస్టేబుల్ సాంబశివరావు తెలిపారు. గురువారం రాత్రి కుటుంబ సభ్యులమంతా కలిసి భోజనం చేసి నిద్రపోయామని, శుక్రవారం
తెల్లవారుజామున చూసేసరికి తన భర్త మరణించి ఉన్నాడని పోలీసులకి తెలిపిన మల్లయ్య భార్య చంద్రవ్వ తనకు ఎవరిపైనా అనుమానం లేదని, విచారణ చేపట్టి చర్యతీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.