AP Govt: గవర్నర్‌ను కలిసిన ఉద్యోగ సంఘ నేతలకు నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం!

Kaburulu

Kaburulu Desk

January 23, 2023 | 03:02 PM

AP Govt: గవర్నర్‌ను కలిసిన ఉద్యోగ సంఘ నేతలకు నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం!

AP Govt: తమ జీతాలు ఆలస్యమవుతున్నాయని.. నెల పొడవునా జీతాలు అసలు ఎప్పుడు జమ అవుతాయో కూడా తెలియడం లేదని.. పెన్షన్లు, బకాయిలు నెలాఖరు వరకు కూడా జమ కావడం లేదని.. ఉద్యోగుల అనుమతి లేకుండానే ఉద్యోగుల ఖాతాల నుంచి జీపీఎస్ డబ్బులు విత్ డ్రా చేస్తున్నారని.. మీ అధికారాలను ఉపయోగించుకొని జీతాలు సమయానికి అందేలా చూడాలని ఒక ఏపీ ఉద్యోగుల సంఘం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసిన సంగతి తెలిసిందే.

కాగా, ఇప్పుడు గవర్నర్ ను కలిసిన ఏపీ ఉద్యోగుల సంఘానికి ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. గవర్నర్ ను ఎందుకు కలవాల్సి వచ్చిందో చెప్ప్పాలని రాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరింది. ఈ మేరకు ఆ సంఘానికి నోటీసులు కూడా జారీ చేసింది. మీడియా, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఈ నోటీసులు ఇస్తున్నట్లు పేర్కొంది. వేతనాలు, ఆర్థిక అంశాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే ప్రత్యామ్నాయ మార్గాలు ఉండగా.. ఎందుకు కలిశారని ఆ సంఘాన్ని ప్రభుత్వం ప్రశ్నించింది. గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయడం రోసా నిబంధనలకు విరుద్ధమని.. సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వారంలోపు చెప్పాలని ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు సకాలంలో చెల్లించడం లేదంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆధ్వర్యంలో నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల బకాయిలు తక్షణమే చెల్లించేందుకు గవర్నర్‌ చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. 12వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి పడిందని, ఉద్యోగుల జిపీఎఫ్ ఖాతా నుంచి ప్రభుత్వం 500 కోట్లు డ్రా చేసిందని చెప్పారు. చెల్లించకుండా పేరుకు పోయిన బకాయిలు ఎంత మొత్తం ఉన్నాయో కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై స్పందించిన ఏపీ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ కూడా వివరణ ఇచ్చారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం, కరోనా పరిస్థితుల కారణంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని అందుకే జీతాలు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. ప్రతి నెల 5వ తేదీనాటికే 90 నుంచి 95 శాతం వేతనాలు, పింఛన్లను చెల్లిస్తున్నట్టు పేర్కొన్న ఆయన.. మిగిలిన 5 శాతం మందికి ఖజానా ఆధారంగా చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. అదలా ఉండగానే ఏపీ ప్రభుత్వం గవర్నర్ ను కలిసిన ఉద్యోగ సంఘానికి నోటీసులు ఇవ్వడం ఇప్పుడు ఉద్యోగ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.