Telangana Politics: మొదలైన ఎన్నికల హడావుడి.. నడిచేదంతా పాదయాత్రల సీజన్!

Kaburulu

Kaburulu Desk

January 1, 2023 | 03:11 PM

Telangana Politics: మొదలైన ఎన్నికల హడావుడి.. నడిచేదంతా పాదయాత్రల సీజన్!

Telangana Politics: తెలంగాణలో ముందస్తు ఎన్నికలే ఫైనల్ అని ఒకసారి.. అబ్బే అదేం లేదు టైమ్ ప్రకారమే తెలంగాణలో ఎన్నికలుంటాయని మరోసారి ఎవరికి వారు ఎన్నో విశ్లేషణలు అయితే సాగిపోతున్నాయి. ముందస్తు ఉంటుందా.. లేక యధావిధిగా ఉంటాయా అన్నది ఎలా ఉన్నా.. తెలంగాణలో ఎన్నికలకు మాత్రం సమయం వచ్చేసినట్లే కనిపిస్తుంది. ఎలా చూసినా ఏడాదే ఉండడంతో అయితే ముందస్తు లేకపోతే యధావిధి ఏదైనా మన మంచికే అన్నట్లు ఎవరికి వారు రాజకీయ పార్టీలన్నీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.

ఎన్నికలంటే ముందు మనకి గుర్తొచ్చేది పాదయాత్రలే. సహజంగా అధికారంలో ఉండేవాళ్ళు ఈ పాత్రయాత్రలకి దూరం. ఎందుకంటే ప్రభుత్వం వాళ్లదే కనుక మళ్ళీ పనిగట్టుకొని ప్రజలలోకి వెళ్లే అవసరం ఉండదు. ప్రభుత్వ పనితీరుని బట్టి అధికారం ఉంచాలా.. వద్దా అన్నది ప్రజలే తెలుస్తారు. అయితే.. అధికారంలో ఉన్నవాళ్లు ఇన్నాళ్లు చేయలేకపోయినవి ఏమైనా ఉంటే ఎన్నికలకు ముందు అవి అమలు చేసేందుకు ప్రయత్నిస్తారు. తెలంగాణలో కూడా ఇప్పుడు కేసీఆర్ సర్కార్ వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. నిరుద్యోగుల వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకొనే పనిలో పడింది.

ఇక, మిగతా పార్టీల విషయానికి వస్తే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు పాదయాత్రలకు సిద్ధమవుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర పేరుతో పలు విడతలుగా కొన్ని నెలల నుండి ప్రజల్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే కాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా పాదయాత్రకి సిద్దమవుతుంది. ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎలక్షన్ టార్గెట్ గా పాదయాత్రకి శ్రీకారం చుట్టబోతున్నారు.

హాత్ సే హాత్ జోడో యాత్ర పేరుతో రేవంత్ పాదయాత్ర మొదలు పెట్టనుండగా.. ఇప్పటికే దీనికి ప్రణాళికలు కూడా సిద్దమైనట్లు తెలుస్తుంది. ఈ మధ్యనే పార్టీలో ప్రముఖులతో చర్చించిన రేవంత్ జనవరి 26 నుండి పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అది కూడా దక్షణ అయోధ్యగా పిలిచే తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాద్రి నుండే పాదయాత్ర మొదలు పెట్టి జూన్ 2న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభతో ముగించాలని చూస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.

ఇక తెలంగాణలో ఎలాగైనా రాజకీయంగా నిలబడాలని చూస్తున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కూడా పాదయాత్రలోనే ఉన్న సంగతి తెలిసిందే. ప్రజా ప్రస్థానం పేరుతో మొదలు పెట్టిన షర్మిల పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకోగా కారుపై దాడి, షర్మిల అరెస్టుతో నిలిచిపోయింది. సరైన సమయం చూసుకొని షర్మిల మళ్ళీ మిగతా రాష్ట్రాన్ని చుట్టేసే ఛాన్స్ ఉంది. అప్పుడు తండ్రి రాజశేఖరరెడ్డికి.. ఇప్పుడు అన్న జగన్ కు బాగా కలిసొచ్చిన పాదయాత్రని షర్మిల వదులుకునే ప్రసక్తే ఉండదు. ఇలా మొత్తంగా ఇప్పుడు తెలంగాణలో ఎటు చూసినా ఎన్నికల ఏడాది పాదయాత్రలు, బస్సు యాత్రల హంగామా కనిపించడం ఖాయంగా కనిపిస్తుంది.