Pawan Kalyan: బయట శత్రువుల కంటే.. మనతో ఉండే శత్రువులతోనే ప్రమాదం.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Kaburulu

Kaburulu Desk

January 25, 2023 | 10:05 PM

Pawan Kalyan: బయట శత్రువుల కంటే.. మనతో ఉండే శత్రువులతోనే ప్రమాదం.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan: బయట ఉండే శత్రువుల కంటే.. మనతో ఉండే శత్రువులతోనే ప్రమాదం ఎక్కువ.. ఏపీలో ఎస్పీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలను తీసేశారని చెపుతుంటే బాధేస్తుంది.. మన హక్కులను కాలరాసే ఎవరినైనా ఎదుర్కోవాల్సిందే.. ఈ మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన రావాల్సిన రూ. 20 వేల కోట్లను రాకుండా చేశారంటే ఏమని ప్రశ్నించాలి.. ఇదీ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు.

ఈ సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. వ్యక్తి ఆరాధన ఎంత మంచిదో.. అంతే ప్రమాదకరమన్నారు. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో వివక్షకు గురవుతారని.. వివక్షకు గురైనప్పుడే దాని గురించి తెలుస్తుందని పేర్కొన్నారు. సమాజాన్ని కొన్ని కోణాల్లోనే కాదు.. సమగ్రంగా చూడాలని పవన్ కళ్యాణ్ అన్నారు. జనాభాకు తగ్గట్టు బడ్జెట్‌ లో కేటాయింపులు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. మన కష్టం, శ్రమకు తగ్గ ఫలితం ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీలు దాదాపు 22 శాతం జనాభా ఉన్నా.. నిధులు ఇవ్వాలని ఇంకా కోరాలా అని ప్రశ్నించారు. ఇకపై దేహి అంటే కుదరదని.. పోరాటాలు చేసి తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ సంపూర్ణంగా అమలు జరగాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలు తీసేశారని చెబుతుంటే చాలా బాధేసిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మూడేళ్లలో రూ. 20 వేల కోట్లు రాకుండా చేశారంటే ఏమనాలని ప్రశ్నించారు. ఎన్ని గొప్ప చట్టాలు, సంస్కరణలు తెచ్చినా ఆచరణలో పెట్టాలి కదా అని నిలదీశారు. ఆచరణలో పెట్టకపోతే చట్టాలు తెచ్చినా ప్రయోజనం ఉండదన్నారు. ఏపీ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం రూ. 15 వేల కోట్లు ఖర్చు చేసిందని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ నిధులు వారికి రాకుండా దారి మళ్లించి మోసం చేస్తారా అని పవన్‌ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం రూ. 15 వేల కోట్లను ఖర్చు చేసిందని.. వైసీపీ రంగుల కోనం రూ. 21,500 కోట్లను దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించిన నిధులను మళ్లించి మోసం చేశారని దుయ్యబట్టారు.