Capital Amaravati: కోర్టులలో స్పష్టత లేని రాజధాని అంశం.. అమరావతిపై విచారణ పూర్తయ్యేది ఎప్పుడు?

Kaburulu

Kaburulu Desk

January 31, 2023 | 09:56 PM

Capital Amaravati: కోర్టులలో స్పష్టత లేని రాజధాని అంశం.. అమరావతిపై విచారణ పూర్తయ్యేది ఎప్పుడు?

Capital Amaravati: జనవరి 31.. ఈ తేదీ కోసం ఏపీ రాజకీయ వర్గాలతో పాటు, ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. కారణం.. ఏపీ రాజధాని అమరావతి అంశంపై సుప్రీంకోర్టు దాఖలైన పిటిషన్లు ఈరోజు విచారణకు వస్తాయని. ఒకవైపు ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై దాఖలు చేసిన పిటిషన్.. మరోవైపు అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు మరికొన్ని పిటిషన్లు కూడా ఈరోజే సుప్రీంకోర్టు విచారిస్తుందని ఆశపడ్డారు. కానీ.. ఇతరత్రా కేసుల బిజీ వలన రాజధాని కేసు మరుగున పడింది.

ఇతరత్రా కేసులతో పాటు అమరావతిపై పిటిషన్లను సుప్రీం కోర్టులో విచారణ చేసేందుకు పలురకాల సమస్యలు కూడా ఉన్నట్లు న్యాయనిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 261 మంది ప్రతివాదులకు నోటీసులు జారీచేశారు. వారంతా తమ తమ అఫిడవిట్లను ఇంకా దాఖలు చేయలేదు. వారిలో అసలు ఎంతమంది పిటిషన్లు దాఖలు చేశారో.. ఎంతమంది చేయలేదో అన్న విషయంపై కూడా స్పష్టత లేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అఫిడవిట్ ను దాఖలు చేయాల్సి ఉంది.

మరి కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిందా? అనేది కూడా స్పష్టత లేదు. మరోవైపు ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన ఆరునెలల్లో రాజధాని నిర్మాణాన్ని పూర్తిచేయాలన్న తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఈ స్టే జనవరి 31వ తేదీ వరకే అమల్లో ఉంది. మరి రేపటి నుండి ఈ స్టే అమల్లో ఉంటుందా.. ఉండదా అనేది తెలియదు. కోర్టు పరిధిలో ఉన్న అంశంలో ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. కానీ, సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డే విశాఖ రాజధాని అని స్టేట్మెంట్ ఇచ్చేశారు. మరి ఈ సాంకేతిక సమస్యలన్నీ ఒక కొలిక్కి వచ్చేది ఎప్పుడు? రాజధాని అంశంలో కోర్టు ఏదో ఒక తీర్పు ఇచ్చేది ఎప్పుడన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అమరావతి రైతుల నిరసనలు ఆగేది ఎప్పుడు?.. నా రాష్ట్రానికి రాజధాని ఇది అని చెప్పుకొనే అర్హత ఏపీ ప్రజలు దక్కేది ఎప్పుడన్నది చూడాల్సి ఉంది.