AP Assembly: అసెంబ్లీలో రగడ.. తమపై దాడి చేశారని టీడీపీ, వైసీపీ సభ్యుల వాదన.. అసలేం జరిగింది?

AP Assembly: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సోమవారం చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్ర ప్రజలను దిగ్బ్రాంతికి గురిచేశాయి. అధికార, విపక్ష సభ్యుల వాదోపవాదనల నడుమ సభా కార్యక్రమాలు పూర్తిగా స్తంభించాయి. తమ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేలపై దాడులకు పాల్పడ్డారని అధికార, ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలకు దిగాయి. సభలో లేని వామపక్షాలు, జనసేన పార్టీలు కూడా సభలో జరిగిన పరిణామాలపై స్పందించడంతో రాజకీయం వేడెక్కింది.
తమ ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వెల్లంపల్లి, బాలవీరాంజనేయస్వామిపై సుధాకర్ బాబు దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బాలవీరాంజనేయస్వామి తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అసెంబ్లీలో తమపై దాడి జరిగిందని, కారకులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తమ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే సుధాకర్ బాబుపై దాడి చేసి టీడీపీ నాటకాలు ఆడుతోందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. సుధాకర్ బాబు తన చేతికి గాయమైందని మీడియా ముందుకు వచ్చారు. బలహీన వర్గాలకు చెందిన స్పీకర్ పై పేపర్లు విసిరేసి టీడీపీ సభ్యులు అవమానించారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీ రాకుండా తమ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి పంపిస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపించారు.
అధికార, విపక్ష సభ్యుల పరప్పర ఆరోపణలతో వరుసగా ఏడో రోజూ ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా మారాయి. సభలో రగడపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. అసెంబ్లీకి సంబంధించి మీడియా ద్వారా అందిన సమాచారం చూస్తే.. ఈ పరిణామాలు దురదృష్టకరమైనవని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేవని పేర్కొన్నారు. ప్రజల గొంతు నొక్కే జీవో నెం.1పై చర్చను కోరిన విపక్ష టీడీపీ ఎమ్మెల్యేలపై అధికార పక్షం దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు.
కాగా, ఏపీ అసెంబ్లీలో దాడుల పర్వంపై సోషల్ మీడియాలోనూ అధికార, విపక్షాలు ఆరోపణలను హోరెత్తించాయి. ఫొటోలు, వీడియోలు, కామెంట్లు పోస్ట్ చేశాయి. టీడీపీ #TDPDalitMLAattackedInAssembly హాష్ ట్యాగ్ తో ట్విటర్ లో తమ వాదనలు వెల్లడించింది. వైసీపీ #TDPRowdiesInAssembly హాష్ ట్యాగ్ తో తమ వెర్షన్ వినిపించింది. దీంతో ఈ రెండు హాష్ ట్యాగ్ లు ట్రెండింగ్ లో నిలిచాయి. రెండు పార్టీల నేతలు, పార్టీల సోషల్ మీడియా ఖాతాలకు సైతం ఒకరిపై ఒకరికి వ్యతిరేకంగా డీపీలు మార్చారు. మొత్తంగా ఏపీ పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది.