KTR Karimnagar Tour: మంత్రి పర్యటనలో ఉద్రిక్తత.. ఏబీవీపీ కార్యకర్తను కాలితో తన్నిన జడ్పీటీసీ

Kaburulu

Kaburulu Desk

January 31, 2023 | 05:21 PM

KTR Karimnagar Tour: మంత్రి పర్యటనలో ఉద్రిక్తత.. ఏబీవీపీ కార్యకర్తను కాలితో తన్నిన జడ్పీటీసీ

KTR Karimnagar Tour: తెలంగాణలో ఎన్నికల హడావుడి ఎప్పుడో మొదలుపెట్టేశారు. ఇలాంటి తరుణంలో మంత్రి కేటీఆర్ జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఆమధ్య నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా నేతలతో సమావేశమై వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మంగళవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.

అయితే, మంత్రి కేటీఆర్ కరీంనగర్ పర్యటనలో ఉద్రిక్తత చోటచేసుకుంది. కేటీఆర్ కాన్వాయ్ ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకోగా.. పోలీసులకు, ఏబీవీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో కేటీఆర్ కరీంనగర్ కు చేరుకోగా.. అక్కడి నుంచి కాన్వాయ్ లో బయల్దేరారు. ఈ సమయంలో కేటీఆర్ కాన్వాయ్ ను ఏబీవీపీ కార్యకర్తలు చుట్టుముట్టి అడ్డుకున్నారు.

కాన్వాయ్ ను అడ్డుకోవడంతో పోలీసులకు, ఏబీవీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం మొదలై రసాభాసగా మారింది. మరోవైపు ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకోబోతున్న సమయంలో బీఆర్ఎస్ కు చెందిన ఓ జెడ్పీటీసీ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏబీవీపీకి చెందిన ఒక కార్యకర్తను జెడ్పీటీసీ కాలితో తన్నారు. దీనిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, కేటీఆర్ జిల్లా పర్యటన క్రమంలో పోలీసులు హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీ నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేశారు. కాంగ్రెస్ నేత రోహిత్‌రావు, టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు మరికొంతమంది సీనియర్ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. వీణవంక మండలంలో కూడా పలువురు బీజేపీ, కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కూడా ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నారు.