Telangana Budget 2023: ఫిబ్రవరి 3 లేదా 5న బడ్జెట్.. ఎన్ని లక్షల కోట్లంటే?

Kaburulu

Kaburulu Desk

January 21, 2023 | 11:46 AM

Telangana Budget 2023: ఫిబ్రవరి 3 లేదా 5న బడ్జెట్.. ఎన్ని లక్షల కోట్లంటే?

Telangana Budget 2023: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి తొలివారంలో 3 లేదా 5 తేదీలలో బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫిబ్రవరి తొలి వారం నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభించనున్నట్టు రాష్ట్ర రాజకీయ వర్గాలలో విస్తృత ప్రచారం జరుగుతుంది. ఆర్థిక మంత్రి హరీష్ రావు 2023-24 రాష్ట్ర తాత్కాలిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 3 లేదా 5వ‌ తేదీల్లో సమర్పించనున్నారు.

సీఎం కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్‌పై శనివారం ప్రగతి భవన్‌లో జరగనున్న అత్యున్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇక, మరోవైపు 2023-24 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. ఈ బడ్జెట్ లో తెలంగాణకు కేంద్రం కేటాయించే నిధులపై ఓ అంచనా వస్తుంది. కనుక ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మరింత కూలంకషంగా రూపొందించనున్నారు.

అయితే, సాధారణంగా రాష్ట్ర బడ్జెట్‌ను మార్చి మొదటివారంలో ప్రవేశపెడుతుంటారు. కానీ, ఇప్పుడు సీఎం కేసీఆర్‌ కొన్ని నెలలుగా జాతీయ రాజకీయాలపై సీరియస్‌గా దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. టీఆర్‌ఎస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌గా మార్చి, ఖమ్మం సభతో జాతీయ స్థాయి సభలకు శ్రీకారం చుట్టారు. దీంతో త్వరలో కేసీఆర్ పూర్తిగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టనున్నారు. ఈ క్రమంలోనే ముందుగా రాష్ట్ర బడ్జెట్ ను తీసుకొస్తున్నారు.

కాగా, 2022-23లో ప్రభుత్వ వ్యయం రూ.2.10 లక్షల కోట్ల నుంచి రూ.2.15 లక్షల కోట్ల వరకు లెక్క తేలుతుందని ఆర్థిక నిపుణుల అంచనా. రాష్ట్ర సొంత ఆదాయ వృద్ధిలో తెలంగాణ దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించినట్టు సమాచారం. రాష్ట్ర సొంత ఆదాయం 19-20 శాతం వృద్ధి నమోదు చేసినట్టు తెలుస్తుంది. దీనిని బట్టి చూస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్‌ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.