Telangana Budget 2023: బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. రెండేళ్ల తర్వాత గవర్నర్ ప్రసంగం

Kaburulu

Kaburulu Desk

February 3, 2023 | 12:36 PM

Telangana Budget 2023: బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. రెండేళ్ల తర్వాత గవర్నర్ ప్రసంగం

Telangana Budget 2023: తెలంగాణలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు ఈ మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రారంభం కాగా.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించనుండడం రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి. అలాగే, టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్‌గా మారిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు కూడా ఇవే. ఈ సమావేశాలను రెండు వారాలపాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

నేడు గవర్నర్ ప్రసంగం తర్వాత సభను వాయిదా వేస్తారు. శనివారం గవర్నర్ ప్రసంగంపై ప్రభుత్వం ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది. ఆదివారం సెలవు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రసంగిస్తారు. మంగళవారం సభకు సెలవు. ఆ తర్వాతి నుంచి సమావేశాలు కొనసాగుతాయి.

ఆతర్వాత 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని నూతన సచివాలయాన్ని ప్రారంభించనుండడంతో 16నే సమావేశాలు ముగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు, తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాదే ఎన్నికలు జరగనుండడంతో ప్రభుత్వానికి ఈ బడ్జెట్ కీలకం కానుంది. బడ్జెట్ ను రూ. 3 లక్షల కోట్లకు పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం.

మరోవైపు, ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ సిద్ధమవుతున్నాయి. దీంతో సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది. విభజన హామీలతో పాటు రెండుసార్లు ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు నేపథ్యంలో ప్రతిపక్షాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. దీంతో ఈ సమావేశాలపై అన్ని రాజకీయ వర్గాలలోనూ, ప్రజలలోను ఆసక్తి నెలకొంది. కాగా, శాసనసభ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శాసనసభ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.