Bachula Arjundu: టీడీపీ సీనియర్ నేతకు గుండెపోటు.. పరిస్థితి విషమమంటున్న వైద్యులు

Kaburulu

Kaburulu Desk

January 29, 2023 | 11:30 AM

Bachula Arjundu: టీడీపీ సీనియర్ నేతకు గుండెపోటు.. పరిస్థితి విషమమంటున్న వైద్యులు

Bachula Arjundu: టీడీపీకి మరో కష్టం ఎదురైంది. ఇప్పటికే నందమూరి కుటుంబసభ్యుడు, టీడీపీ యువనేత తారకరత్న గుండెపోటుతో బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సంగతి తెలిసిందే. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న ఉన్నట్లుండి కుప్పగూలిపోవడంతో మొదట కుప్పం ఆసుపత్రికి అక్కడ నుండి బెంగళూరు హృదయాలయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అదలా ఉండాగానే టీడీపీ మరో సీనియర్ నేత బచ్చుల అర్జునిడి గుండెపోటుకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చినట్లు తెలుస్తుండగా.. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను విజయవాడలోని రమేశ్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఐసీయూలో ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు స్టంట్ అమర్చిన డాక్టర్లు.. బీపీ ఎక్కువగా ఉన్నందున పరిస్థితి విషమంగానే ఉన్నట్లు చెప్పారు.

తారకరత్న ఆరోగ్య పరిస్థితి, ఆందోళనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ ద్వారా బచ్చుల అర్జునుడి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే అర్జునుడు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన చంద్రబాబు.. డాక్టర్లను అడిగి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించి.. అర్జునుడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

కాగా, కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన బచ్చుల అర్జునుడు గతంలో మచిలీపట్నం మున్సిపాలిటీ ఛైర్మన్‌గా పని చేశారు. 2014లో ఆయ‌న‌ కృష్ణా జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులవగా.. టీడీపీ కేంద్ర కమిటీ క్షమశిక్షణా కమిటీ ఛైర్మన్ గానూ ఉన్నారు. 2017లో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. అర్జునుడి విషయం తెలుసుకున్న టీడీపీ ముఖ్య నేతలు రమేశ్ ఆసుపత్రకి చేరుకొని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.